కామేపల్లి: ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం చేతికొచ్చింది.. హార్వెస్టర్ ద్వారా నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు తీసుకెళ్లాలని రైతు సిద్ధమవుతుండగా ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త కారణంగా మృతి చెందాడు. కామేపల్లి మండలం జాస్తిపల్లిలో గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. జాస్తిపల్లికి చెందిన వేముల ఉపేందర్(40) సాగు చేసిన వరి పొలాన్ని హార్వెస్టర్ ద్వారా నూర్పిడి చేయించాడు. ఆతర్వాత ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. అదే గ్రామానికి చెందిన రాయల పెద్దిరాజు ట్రాక్టర్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చాడు. ఈక్రమాన హార్వెస్టర్ పక్కనే ఉన్న ఉపేందర్‌ను గమనించకకుండా ఢీకొట్టడంతో పడిపోగానే ఆయన పైకి ట్రాక్టర్ ఎక్కింది. సమీప రైతులు అప్రమత్తమై తీవ్రగాయాలతో ఉన్న ఆయనను ఆటోలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై ఉపేందర్ భార్య రేణుక ఫిర్యాదుతో ట్రాక్టర్ డ్రైవర్ పెద్దిరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
ట్రాక్టర్ కింద పడడంతో మృతి


