ఇల్లెందు రూరల్: వేసవి సెలవులు రాగానే చిన్నారుల్లో ఎక్కడ లేని ఆనందం. అయితే ఈ సెలవులను సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. ఒకప్పుడు నీతి కథలు, పురాణాలు, ఇతిహాసాల్లోని కథలను అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పేవారు. ప్రస్తుతం అలాంటివి చెప్పేవారు ఉన్నా.. వినే ఓపిక పిల్లలకు లేకుండా పోయింది. సెలవులనగానే సెల్‌ఫోన్ చేతపట్టి ఇంటర్నెట్‌తో కాలక్షేపం చేస్తున్నారు. వీడియో గేమ్‌లు, కార్టూన్ చానళ్లతోనే కాలం గడుపుతున్నారు. అలాకాకుండా తల్లిదండ్రులు కాస్త మనసు పెడితే పిల్లలు ఆసక్తిగా చూసేలా నీతి కథలు, విలువలను బోధించే కార్టూన్లను పరిచయం చేసే అవకాశం ఉంది.
సెలవుల్లో విజ్ఞానం
పాలు తాగే పసిపాప మొదలు బుడిబుడి అడుగులు వేసే పిల్లలు, ఆపై వయస్సు పిల్లలు కూడా సెల్‌ఫోన్లలో ఆటలకు పరిమితమయ్యారు. చిన్నవయస్సులో ఏడస్తున్న పసిహృదయాలకు సెల్‌ఫోన్ చేతిలో పెట్టి ఊరుకోబెడుతూ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నమే చిన్నారులను సెల్‌ఫోన్‌కు అతుక్కుపోయేలా చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వారికి ఉపయోగపడేలా కథలను అందించే కొన్ని వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లిష్‌లోనే కాక అచ్చతెలుగులో విజ్ఞానాన్ని పెంచే కథలు, సామెతలు, పొడుపు కథలు, అక్బర్, బీర్బల్, చందమామ కథలు వంటివి చదవొచ్చు.. వినొచ్చు. మరికొన్ని సైట్లు పిల్లల పత్రికలు, మ్యాగజైన్‌లను అందిస్తున్నాయి. సెల్‌ఫోన్‌తో మారాం చేసే చిన్నారులకు వెబ్‌సైట్లలో నీతి కథలు వినిపిస్తూ వినోదం, విజ్ఞానం కూడా అందించేలా తల్లిదండ్రులు దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
వెబ్‌సైట్లలో ఏముందంటే..
వెబ్‌సైట్లలో చిన్నారుల మేథోవికాసాన్ని పెంపొందించే పిట్టకథలు, బుర్రకథలు, తెనాలి రామకృష్ణ, సరదా కథలు, పాటలు, చందమామ కథలు, తెగులు పద్యాలు, పిల్లల వీడియోలు, పొడుపు కథలు, వేమ, సుమతి, భాస్కర శతక పద్యాలు లభిస్తాయి. అలాగే, పంచతంత్ర కథలు, గొప్ప రాజులు, పురాతన ఆలయాలు, శ్లోకాలు తదితరాలను పరిచయం చేస్తున్నారు. సాహిత్యంలో భాగంగా రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు, ప్రవచనాలు అందుబాటులో ఉన్నాయి.


