సత్తుపల్లిటౌన్: ఒక ఊరిలో రెండు కోడి పుంజులు ఉండేవి. రెండింటికి బడాయి ఎక్కువే కావడంతో ఒక దాన్ని మించి మరొకటి బడాయి పోయేవి. ఓ రోజు గింజలు ఏరుకుని తింటున్న రెండు పుంజుల మధ్య మాటామాట పెరిగింది. ఆ మాటలు పెరిగి పందేనికి దారి తీశాయి. ఎవరు ఎక్కువ ఎత్తు ఎగరగలరనే అంశంపై పందెం వేసుకున్నాయి. నేను ఎక్కువ ఎత్తు ఎగరగలనని మొదటి పుంజు అంటే.. నీ కంటే నేనే ఎక్కువ ఎత్తు ఎగురుతాను అన్నది రెండో పుంజు.
పెద్దమనిషిగా వ్యవహరించమని వీటి కంటే పెద్ద వయస్సు ఉన్న పుంజును అడిగాయి. ఆ పెద్దమనిషి పుంజు మాత్రం ఇలాంటి పందేలు వద్దని వారించింది. వీటితో నష్టం కలుగుతుందని హితవు చెప్పింది. అయినా పందెం మోజులో ఉన్న పుంజులకు మంచి మాటలు తలకెక్కలేదు. పెద్దమనిషి లేకపోతేనేం.. మనమే న్యాయంగా పోటీ పడదామని అంగీకారానికి వచ్చాయి. వద్దు.. వద్దు అని ఇంకొన్ని పుంజులు చెప్పినా వినలేదు.
పందెం మొదలైంది. మొదటి పుంజు ప్రహరీ మీదకు ఎగిరింది. రెండో పుంజు ఇంటి కప్పు మీదకు ఎగిరింది. చూశావా నేనే ఎత్తు ఎగిరిరాను అన్నట్టు రెండో పుంజు చూస్తుండగానే మొదటి పుంజు చెట్టుకొమ్మపై వాలింది. మొదటి పుంజు గాలిలోకి అంత ఎత్తున రివ్వున ఎగిరింది. ఇంతలో సుడిగాలిలా వచ్చిన గద్ద మొదటి పుంజును తన కాళ్లతో ఒడిసి పట్టుకుని ఎగరేసుకుపోయింది. చిటారు కొమ్మన కూర్చున్న రెండో పుంజు ఇది చూసి చిగురుటాకులా వణికి పోయింది. గద్దకు కనబడకుండా ఒదిగి కూర్చుంది. గద్ద కనుమరుగయ్యాక కిందకి దిగింది. ఇదంతా చూస్తున్న మిగతా పుంజులు బడాయికి పోతే ప్రాణమే పోయింది కదా అని అనుకుంటూ గూటికి పయనమయ్యాయి.
నీతి : ప్రతీ ఒక్కరిలో అంతర్లీనంగా శక్తి ఉంటుంది. కానీ దాన్ని అవసరాలకు మాత్రమే వాడుకోవాలి. అలాకాకుండా బడాయికి వెళ్తే శతృవుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎదురవుతుంది.
అమ్మమ్మ చెప్పిన కథ


