వైరా: వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడుకు చెందిన మిషన్ భగీరథ కార్మికుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన పింగళి శ్రీను(48) మిషన్ భగీరథలో పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన మద్యానికి బానిస కావడంతో వారం క్రితం భార్య రాధ, ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన శ్రీను ఈనెల 4న ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోగా, ఈ విషయం బయటపడలేదు. అయితే, గురువారం శ్రీను సోదరుడు వెళ్లి ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఆయన ఆత్మహత్య విషయం బయటపడింది. ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామారావు తెలిపారు.
ఆయిల్‌పామ్ మొక్కలు దగ్ధం
కొణిజర్ల: మండలంలోని లక్ష్మీపురంలో రైతు ధరావత్ నంద్యానాయక్ సాగు చేస్తున్న తోటలో ఆయిల్‌పామ్ చెట్లు కాలిపోయాయి. ఆయన ఐదెకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తుండగా గురువారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో రెండెకరాల విస్తీర్ణంలో మొక్కలు కాలిపోయాయి. సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, నాయకులు కుటుంబరావు, హరిచంద్, చింతపల్లి ప్రసాద్, అజయ్‌కుమార్, మహబూబ్ అలీ, కృష్ణకాంత్ తదితరులు తోటను పరిశీలించి రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పోలీసులపై దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్
మణుగూరు టౌన్: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న పోలీసులపై మద్యం మత్తులో కత్తితో దాడికి యత్నించిన వ్యక్తిని మణుగూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తోగ్గూడెం సమ్మక్క–సారలమ్మ దేవాలయం వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో తోగ్గూడెం గ్రామానికి చెందిన సోలం నాగేశ్వరరావు మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. పోలీసులు అడ్డుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా నిర్థారణ అయింది. దీంతో అతడిని మందలించి ఇంటికి పంపించారు. ఆతర్వాత తనకే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారా అంటూ నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని తనిఖీలు చేపడుతున్న పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.


