పంటలు.. బుగ్గిపాలు | - | Sakshi
Sakshi News home page

పంటలు.. బుగ్గిపాలు

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

● అవశేషాల కాల్చివేతతోనే తీరని నష్టం ● అన్నదాతల్లో అవగాహనలేమితో ప్రమాదాలు ● పలు ప్రాంతాల్లో రూ.లక్షల విలువైన పంటలు ఆహుతి

అవగాహన కల్పిస్తున్నాం..

● అవశేషాల కాల్చివేతతోనే తీరని నష్టం ● అన్నదాతల్లో అవగాహనలేమితో ప్రమాదాలు ● పలు ప్రాంతాల్లో రూ.లక్షల విలువైన పంటలు ఆహుతి

ఖమ్మంవ్యవసాయం: యాసంగిలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు పలు కారణాలతో బుగ్గి పాలవుతున్నాయి. రైతుల అవగాహన ఏమి, ప్రకృతివైపరీత్యాల కారణంగా పంటలు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఈ ఏడాది జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న, వరి గణనీయ స్థాయిలో సాగయ్యాయి. ప్రస్తుతం కోత, కల్లాల్లో ఆరబెట్టడం, విక్రయించే పనులు సాగుతున్నాయి. ఈ దశలో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలతో రూ. లక్షల విలువైన పంట కాలిపోతోంది. పైరుపైన కోతదశలో ఉన్న మొక్కజొన్న, వరి పంటలే కాక కోసి రాశులుగా పోసిన పంట కూడా ప్రమాదాల బారిన పడుతుండగా మామిడి, ఆయిల్‌ పామ్‌ తోటలు కూడా కాలిపోతున్నాయి.

వరుస ఘటనలు..

తాజాగా చింతకాని మండలం పాతర్లపాడులో 45 మంది రైతులకు చెందిన రూ. 15లక్షల విలువైన 600 క్వింటాళ్ల మొక్కజొన్నలు కాలిపోయాయి. బస్వాపురంలో నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న కాలిబూడిదైంది. అలాగే, 20 ఎకరాల్లో మామిడి తోటలు, లచ్చగూడెంలో పామాయిల్‌ తోట, చింతకానికి చెందిన రైతు ట్రాక్టర్‌, కామేపల్లి మండలం సాతానపురం, జీ.వీ.నారాయణపురంలో మొక్కజొన్న చేన్లు, మధిర మండలం మాటూరు, బోనకల్‌ మండలంలో మొక్కజొన్న రాశులు, కాలిపోగా.. కొణిజర్ల, నేలకొండపల్లి, ముదిగొండ, కూసుమంచి, కల్లూరు మండలాల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరిగాయి.

అవశేషాల కాల్చివేతతోనే..

పంట కోతలు పూర్తయ్యాక రైతులు అవశేషాలకు మంట పెడుతున్నారు. ప్రస్తుత వేసవిలో వడగాలులతో మంటలు వేగంగా విస్తరిస్తూ సమీపంలోని పంట చేన్లు, రాశులను తాకి కాలిపోతున్నాయి. పరిసరాల్లో ఉన్న ఆయిల్‌ పామ్‌ తోటలు, మామిడి తోటలకూ మంటలు చేరి కాలిపోతుండడంతో రైతులకు తీరని నష్టం ఎదురవుతోంది.

నష్టాలపై అవగాహన లేక..

పంటల అవశేషాలు కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాక నేలకు, రైతు ఆదాయానికి నష్టం ఎదురవుతోంది. నేలలో పంట వ్యర్థాలు తగలబెడితే సేంద్రియ కర్బనం, నైట్రోజన్‌, పాస్పరస్‌, పొటాష్‌, గంధకం వంటి పోషకాలు నశించిపోతున్నాయి. మేలు చేసే బ్యాక్టీరియా తగ్గడంతో నేల బురదగా మారి దున్నడం కష్టమవుతుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. పంట అవశేషాలు, వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నితే లాభాలు ఉన్నాయనే అంశంపై రైతుల్లో అవగాహన లోపించడం ఇందుకు కారణమని చెబుతున్నారు.

నష్టపరిహారం వర్తించదు..

పంట కాలిపోతే నష్టపరిహారం వర్తించదు. అతివృష్టి, అనావృష్టి సమయాన ప్రకృతి వైపరీత్యాల కింద ప్రభుత్వం నిబంధనల మేరకు పరిహారం చెల్లిస్తుంది. కానీ అగ్నిప్రమాదానికి పరిహారం లేదు. ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా స్పందిస్తేనే సాయం అందే అవకాశముంది. ఇటీవల జిల్లాలో అగ్ని ప్రమాదాల కారణంగా జరిగిన పంట నష్టాలను కొందరు ప్రజా ప్రతినిధులు, రైతు కమిషన్‌ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇదే సమయాన ప్రభుత్వ శాఖలు కూడా కాలిపోయిన పంటల వివరాలపై నివేదికలను సిద్ధం చేస్తున్నాయి.

అవశేషాల కాల్చివేతతో అన్ని రకాలుగా నష్టం ఎదురవుతోంది. ఈ అనర్థాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతు వేదికల్లోనే కాక క్షేత్రస్థాయిలో నిర్వహించే కార్యక్రమాల్లో మంట పెడితే నష్టాలు, కలియదున్నితే కలిగే లాభాలను వివరిస్తున్నాం. అరుగాలం శ్రమించి పండించిన పంటలు కాలిపోతే నష్టం ఎదురుకానున్నందున రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి.

– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement
 
Advertisement
Advertisement