● సమ్మేళనంలో దత్తేశ్వరానంద భారతి
ఖమ్మం అర్బన్: హిందువులైన ప్రతీఒక్కరు గర్వించాలని దత్తేశ్వరానంద భారతి సూచించారు. ఖమ్మం ఆరో డివిజన్ ప్రశాంత్‌నగర్‌లో గురువారం రాత్రి జరిగిన విరాట్ హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. హిందువుల ఐక్యతే జాతీయ సమైక్యతగా నిలుస్తుందని తెలిపారు. విరాట్ హిందూ సమ్మేళన ఆహ్వాన కమిటీ, అభయ వేంకటేశ్వర ఆలయ కమిటీ బాధ్యులు అద్దంకి నాగేశ్వరరావు, కొల్లా రవీందర్, అల్లిక అంజయ్యతో పాటు పల్లెబోయిన చంద్రయ్య, బస్వోజు వెంకటేశ్వర్లు, ఏలూరి శ్రీనివాసరావు, బొల్లి కొమరయ్య, వనతడపా గౌతమ్‌కుమార్, చారి, దండా జ్యోతిరెడ్డి, భగవాన్‌శర్మ, కోనేటి శ్రీనివాసరావు, మేకల వీరన్నపురం, పల్లపు సత్యం, పురం తిరుపతయ్య, దాచేపల్లి సంతోష్, నాగండ్ల కోటి తదితరులు పాల్గొన్నారు.
కోళ్ల వ్యర్థాలు డ్రెయినేజీల్లో వేయొద్దు..
● పలు షాపుల్లో తనిఖీ చేసిన
ఎమ్మెల్యే కనకయ్య
ఇల్లెందు: చికెన్ షాపుల నిర్వాహకులకు వ్యర్థాలను డ్రెయినేజీల్లోకి వదలొద్దని ఇల్లెందు ఎమ్మెల్యే సూచించారు. ఇల్లెందులోని పలు షాపుల నుంచి వ్యర్థాలు డ్రెయిన్లలోకి చేరుతుండడంతో దుర్వాసనకు కారణంగా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకుఫిర్యాదు చేశారు. దీంతో గోవింద్ సెంటర్‌లోని పలు షాప్‌లను గురువారం ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. దుర్వాసన వెదల్లుతుండడాన్ని గుర్తించిన ఆయన షాపుల యజమానులను హెచ్చరించడమే కాక నిరంతరం తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, కోళ్ల వ్యర్థాలను సేకరించి బయటకు తరలించేలా టెండర్ ద్వారా బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. మున్సిపల్ డీఈ మురళి, నాయకులు పాల్గొన్నారు.
చలివేంద్రం ధ్వంసం ఘటనపై కేసు
ఖమ్మం అర్బన్: ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఖమ్మం 20వ డివిజన్ కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంతలక్ష్మి జశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. చలివేంద్రంలోని కుండల్లో మూత్ర విసర్జన చేసి అమానుషంగా ప్రవర్తించడమే కాక ఫ్లెక్సీలను చింపివేశారని ఫిర్యాదు అందింది. పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను చర్యలు తీసుకోవాలని కోరగా, కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన
మధిర: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మధిర రైతు వేదికలో గురువారం సౌర విద్యుత్ ఉత్పత్తి, పీఎం కుసుమ్, వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కల్పించారు. అంతేకాక సాగులో ఉయోగపడే పరికరాలను ప్రదర్శించి వాటి వినియోగాన్ని రైతులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య మాట్లాడుతూ.. మార్కెట్‌లో డిమాండ్ ఉండే మేలైన సన్నరకం వరి విత్తనాలు సాగు చేయాలని సూచించారు. తొలకరి వర్షాలు పడ్డాకే విత్తనాలు నాటుకోవాలని, ముందుగా నాటితే మొలక శాతం తగ్గుతుందని పేర్కొన్నారు. సంప్రదాయ పంటలకు బదులు ఆయిల్‌పామ్ సాగుతో దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని తెలిపారు. కాగా, పంట వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా భూమిలో కలియదున్నాలని సూచించారు. మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు మాట్లాడగా.. శాస్త్రవేత్త నాగస్వాతి, వ్యవసాయ, విద్యుత్ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
భద్రాచలంలో
కూలిన సిగ్నల్ పోల్
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో గురువారం రాత్రి తీవ్రమైన గాలిదుమారం కారణంగా అంబేడ్కర్ సెంటర్‌లోని ట్రాఫిక్ సిగ్నల్ ఐరన్ పోల్ పక్కకు ఒరిగి రోడ్డుపై పడింది. అయితే, ఈ సమయాన వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో ప్రమాదమే తప్పినట్లయింది. ప్రధాన కూడలిలో స్తంభం అడ్డంగా పడడంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది.


