ప్రభుత్వం అనుమతించినా
మొదలుకాని పనులు
సాగర్ నీటితో అన్నీ నిండుకుండలుగా ఉండడమే కారణం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది చెరువుల పూడికతీత పనులు చేపట్టడంపై మీమాంస నెలకొంది. సాగర్ ఆయకట్టు పరిధిలోని చెరువులన్నీ నిండా నీటితో ఉండడమే ఇందుకు కారణంగా మారింది. గత నెల చివరి వరకు సాగర్ నీటి విడుదల కొనసాగడంతో పలు మండలాల పరిధిలోని చెరువుల్లో సగానికి పైగా నిల్వలు ఉన్నాయి. దీంతో అధికారులు ఎటూ తేల్చకోలేకపోతున్నారు.
జిల్లాలో 1,415 చెరువులు
జిల్లాలో 1,415 చెరువులు ఉన్నాయి. ఇందులో 100 ఎకరాలకుపైగా ఆయకట్టు కలిగినవి 984 ఉన్నట్లు జలవనరుల శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. చెరువుల్లో నీటి సామర్ధ్యం పెంచడం, తద్వారా ఆయకట్టుకు సరిపడా సాగునీరు అందేలా ఏటా వేసవిలో పూడికతీత పనులు చేపడుతారు. ఈ మట్టిని రైతులు పొలాల్లోకి ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు కల్పిస్తారు. ఈసారి కూడా ప్రణాళిక రూపొందించినా, చెరువుల్లో పూడికతీతకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా నీటి నిల్వలతో పనులు మొదలుకాలేదు. అంతేకాక మే నెల రెండో వారం వస్తుండడంతో జూన్‌లో వర్షాలు మొదలయ్యే పనులు చేపట్టాలంటే కష్టమేనని భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని చెరువుల అంచుల్లో మాత్రమే 10 శాతం మేర పూడికతీతకు అవకాశముందని చెబుతున్నారు. ఇదే సమయాన సాగర్ నీరు ప్రవహించని గ్రామాల పరిధిలో కొన్నిచెరువుల్లో మాత్రం పూడికతీత, రైతులు మట్టి తరలించడానికి అధికారులు అనుమతులు ఇస్తున్నా పనులు జోరందుకోలేదు. కాగా, మట్టి కోసమంటూ చెరువుల్లో నీటిని బయటకు వదిలేలా ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని జల వనరుల శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.


