మక్క రైతులపై అదనపు బాదుడు | - | Sakshi
Sakshi News home page

మక్క రైతులపై అదనపు బాదుడు

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

విక్రయం భారంగా మారింది..

ఖమ్మంవ్యవసాయం: కష్టనష్టాలను ఓర్చుకుని మొక్కజొన్న సాగు చేసిన రైతులు.. ఆ పంటను అమ్ముకునేందుకు మరిన్ని అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రైవేటు మార్కెట్‌లో మద్దతు ధర లేకపోవడంతో విక్రయాల్లో అడుగడుగునా అవరోధాలు ఏర్పడుతున్నాయి. వే బ్రిడ్జి కాంటాలు, దిగుమతుల్లో హమాలీ మామూళ్ల పేరిట అదనపు వసూళ్లు చేస్తుండడంతో రైతులకు నష్టం ఎదురవుతోంది. పంట ఆరబెట్టాక తేమ శాతం పరీక్ష చేయించుకోవటం, విక్రయించుకునేందుకు గన్నీ బస్తాల కోసం వేచిచూడటం, ఆ తర్వాత కాంటాలు వేయించటం, ప్రభుత్వ శాఖలు అనుమతించినప్పుడు ట్రాక్టర్‌లో లోడ్‌ చేయించి మక్కలను గోదాము(ఖమ్మం మార్కెట్‌)కు తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో అడుగడుగునా అదనపు వసూళ్లతో రైతు చిత్తవుతున్నాడు.

దూరాన్ని బట్టి వసూలు..

గ్రామంలో పంట విక్రయ సమయాన క్వింటాకు కాంటా ఖర్చు, లోడింగ్‌కు రూ.65 – రూ.80 తీసుకుంటున్నారు. ఇక ట్రాక్టర్‌పై రవాణాకు దూరం ఆధారంగా చార్జి వసూలు చేస్తున్నారు. గోదాం వద్ద వెంటనే దిగుమతి కాకపోతే వెయిటింగ్‌ చార్జిఅదనంగా తీసుకుంటున్నారు. ఈ చార్జీలు క్వింటాకు రూ.50 వరకు అవుతున్నాయి. అయితే, ఈ చార్జీలను మార్క్‌ఫెడ్‌ చెల్లిస్తామని చెబుతున్నా.. ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ట్రాక్టర్‌ వే బ్రిడ్జిపై కాంటాకు ఒక్కో టిక్కీ(50 కిలోల బస్తా)కి రూ.2 ట్రాక్టర్‌ మొత్తం కాంటాకు రూ.100, లారీ అయితే రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక దిగుమతి వద్ద హమాలీలు మామూళ్ల పేరిట ట్రాక్టర్‌కు రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. మక్కలు క్వింటాకు ప్రభుత్వం రూ. 2,400గా ప్రకటించినా.. ఇతర ఖర్చులు రూ.400 పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంటాలు, మామూళ్ల పేరిట వసూళ్లు

ఈ యాసంగిలో 15 ఎకరాల్లో మొక్కజొన్న వేశా. ఎండల్లో పంట పండించడంలో పడిన ఇబ్బంది కంటే విక్రయంలో మరిన్నిపాట్లు పడుతున్నాం. ప్రతిచోట అదనపు రేట్లు వసూలు చేస్తున్నారు. వే బ్రిడ్జి వద్ద, హమాలీలు మామూళ్ల పేరిట అన్నీ అదనంగా వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. – చావా ప్రవీణ్‌, రైతు, ముఠాపురం,

నేలకొండపల్లి మండలం

Advertisement
 
Advertisement
Advertisement