ఖమ్మం మామిళ్లగూడెం: హైదరాబాద్‌లో ఈనెల 10న జరిగే సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటున్నందున పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ చేరుకుని రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆతర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు. ఈమేరకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో తరలిరావాలని సూచించారు. కాగా, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు మూడోసారి బ్రహ్మరథం పట్టడమే కాక పశ్చిమబెంగాల్‌లోనూ అధికారం కట్టబెట్టారని తెలిపారు. సుస్థిరమైన, అవినీతి రహిత పాలన అందిస్తున్న బీజేపీ మాత్రమే అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయమని సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం మాజీ సైనికులు డి.పాండురంగయ్య, అబ్దుల్ రషీద్, అంబటి సురేష్, మెహబూబ్, హన్మంతరావును ఆయన సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు సన్న ఉదయప్రతాప్, గోంగూర వెంకటేశ్వరరావు, భాగ్యరెడ్డి, రుద్ర ప్రదీప్, నున్నా రవి, శ్యామ్‌సుందర్, రవి రాథోడ్, సాయిరాం, విజయారెడ్డి, మణి, మల్లేశ్వరి, రమణ, సంజయ్, పాలెపు రాము పాల్గొన్నారు.


