చుంచుపల్లి: తలసేమియా బాధితులను గుర్తించాలని భద్రాద్రి డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. శుక్రవారం ప్రపంచ తలసేమియా దినోత్సవం కావడంతో గురువారం ఆయన మహిళ ఆరోగ్య కార్యకర్తలతో ఆన్‌లైన్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల్లో తలసేమియా వ్యాధిపై అవగాహన పెంపొందించేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. తలసేమియా వారసత్వ రక్త సంబంధిత వ్యాధి అని, ముందస్తుగా గుర్తిస్తే సరైన చికిత్సతో బాధితులు ఆరోగ్యంగా జీవిస్తారని వివరించారు. చిన్నపిల్లల్లో తరచుగా రక్తహీనత, అలసట, బలహీనత, ఎదుగుదల లోపం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తలసేమియా బాధితులను గుర్తించేందుకు రక్త పరీక్షలు అవసరమని తెలిపారు. వివాహానికి యువత తలసేమియా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్‌లో పిల్లలకు ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చని వివరించారు. గర్భిణులు కూడా అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎన్‌సీడీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించాలని సూచించారు. వేసవికాలం దృష్ట్యా అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ప్రజలు ఎండలో తిరగకూడదని, ఉదయం 11 గంటల వరకు పని ముగించుకుని ఇంటికి చేరాలని, ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని, ఎక్కువ నీటిని తాగాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రతాప్, రాందాస్, సిబ్బంది మోహన్, రాంప్రసాద్ పాల్గొన్నారు.
భ ద్రాద్రి డీఎంహెచ్‌ఓ
డాక్టర్ తుకారాం రాథోడ్


