ఎన్నికలు ఎప్పుడు?
బీఆర్‌ఎస్‌తో మొదలై
కాంగ్రెస్‌తో ఆఖరు
రాజకీయ సమీకరణలతో
తలకిందులైన బలాబలాలు
ఎన్నికలకు సమాయత్తం అవుతున్న రాజకీయ పార్టీలు
కార్పొరేషన్..
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) పాలకవర్గ పదవీ కాలం బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యాన ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవలే మున్సిపాలిటీలు, రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ తరుణాన కేఎంసీ ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. కాగా, ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం ఎన్నికై నప్పటితో పోలిస్తే ముగిసే నాటికి పార్టీల బలాబలాలు తారుమారు కావడం విశేషం. 2021 మే 3న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ ఆధ్వర్యాన అదేనెల 7న పునుకొల్లు నీరజ మేయర్‌గా పాలకవర్గం ఏర్పడింది. ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలకవర్గ పదవీకాలం ముగిసింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
43 డివిజన్లలో గెలుపు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2021 ఏప్రిల్ 30న జరగగా మే 3న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, సీపీఐ పొత్తుతో పోటీ చేయగా.. బీఆర్‌ఎస్ అభ్యర్థులు 43డివిజన్లలో విజయం సాధించారు. సీపీఐ రెండు చోట్ల గెలిచింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు 10 డివిజన్లలో, సీపీఎం రెండు చోట్ల, స్వతంత్ర అభ్యర్థులు రెండు చోట్ల, బీజేపీ అభ్యర్థి ఒక డివిజన్‌లో విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌కు తిరుగులేని ఆధిక్యత దక్కడంతో మేయర్‌గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహారాతోపాటు కార్పొరేటర్లు అదే ఏడాది కార్పొరేషన్ పాత కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఇద్దరు బీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ బలం ఎనిమిదికి పడిపోయింది.
మేయర్, డిప్యూటీ మేయర్ సహా..
గత అసెంబ్లీ ఎన్నికల వరకు కేఎంసీ పాలకవర్గం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలోనే కొనసాగింది. 2023 డిసెంబర్‌లో అటు రాష్ట్రం, ఇటు జిల్లాలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యాన ఎన్నికలకు ముందే కొందరు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరికల పరంపర ఫలితాలు వచ్చాక కూడా కొనసాగింది. మేయర్, డిప్యూటీ మేయర్ సైతం కాంగ్రెస్‌లో చేరగా.. ఇంకొందరు కార్పొరేటర్ల చేరికతో కేఎంసీలో కాంగ్రెస్ పార్టీ బలం 41కి పెరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు మెజార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పక్షాన ఉండటంతో ఆ పార్టీ కనుసన్నల్లోనే పాలకవర్గం పనిచేసింది.
అన్ని డివిజన్లలో అభివృద్ధి..
ప్రభుత్వాలు ఏమైనా కేఎంసీ పాలకవర్గం 2021 నుంచి 2026 వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించింది. 60 డివిజన్లలోనూ పార్టీలతో సంబంధం లేకుండా మౌలిక వసతులు కల్పించారు. ఐదేళ్ల కాలంలో వివిధ రూపాల్లో వచ్చిన రూ.830 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పార్కులు, సెంట్రల్ లైటింగ్, గోళ్లపాడు చానల్ ఆధునికీకరణ వంటి పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు మరో రూ.2 వేల కోట్లతో నూతన బస్టాండ్, ఐటీ హబ్, సమీకృత మార్కెట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, తీగల వంతెన, రిటైనింగ్ వాల్ తదితర పనులను చేపట్టారు. ఇందులో కొన్ని పూర్తవగా.. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. అంతేకాక అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కూడా కొనసాగుతోంది.
కేఎంసీ పాలకవర్గ పదవీ కాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణపై చర్చ మొదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీకాలం ముగిసిన రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. ఆ సమయంలోనే కేఎంసీ మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. అప్పుడే పాలకవర్గాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని భావించినా.. రకరకాల కారణాలతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ప్రస్తుతం పాలకవర్గ పదవీకాలం ముగియడంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై చర్చలు మొదలయ్యాయి. ఎన్నికల నిర్వహణకు సమయం తీసుకుంటారా.. వెంటనే స్పందిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కేఎంసీ ఎన్నికలకు మరికొంత సమయం పడుతుందనే చెబుతున్నారు. అప్పుటి వరకు ప్రత్యేక అధికారి పాలనలో పాలన సాగనుంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ చేసేలా తాజా మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల్లోని ఆశావహులు సిద్ధమవుతున్నారు. గతంలో టికెట్ దక్కని వారు.. పోటీ చేసి ఓడిపోయిన వారు, తాజా మాజీలు తమవంతు ప్రయత్నాలను ప్రారంభించారు. ఇక రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.
ముగిసిన కేఎంసీ పాలకవర్గ పదవీ కాలం


