ఖమ్మంఅర్బన్: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభిస్తారు. ఖమ్మంలోని సారథినగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనుండగా, పంపింగ్ వెల్‌రోడ్, గుట్టల బజార్, నిజాంపేట్, బ్యాంక్ కాలనీ, వేణుగోపాల్ నగర్, రాపర్తి నగర్ తదితర ప్రాంతాల్లో సైతం శంకుస్థాపన చేస్తారు. అలాగే, లకారం పార్క్ సమీపాన పెట్ పార్క్, కొత్తగూడెం, అల్లీపురం ప్రాంతాల్లో సీసీ డ్రెయిన్లు, డ్రింక్ ఫ్రం ట్యాప్ పథకాన్ని మంత్రి ప్రారంభించనున్నారు.
జిల్లా కోర్టును సందర్శించిన ఎంపీ రఘురాంరెడ్డి
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా న్యాయస్థానాన్ని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి బుధవారం సందర్శించారు. బార్ అసోసియేషన్ ఆహ్వానంతో కోర్టుకు వెళ్లిన ఆయన జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలవగా ఎంపీని సత్కరించారు. అలాగే, వేసవి దృష్ట్యా రామసహాయం కల్పనా రెడ్డి జ్ఞాపకార్థం దద్దోజనం, పెరుగన్నం పంపిణీని ఎంపీ పరిశీలించి జూన్ 1వ తేదీ వరకు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఆతర్వాత సొసైటీ రూమ్‌ను కూడా పరిశీలించారు. సీనియర్ న్యాయవాదులు స్వామి రమేష్‌కుమార్, నిరంజన్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యడ్లపల్లి రమేష్, కొప్పుల రవి, దండ సుధాకర్‌తో పాటు రాజశేఖర్‌రెడ్డి, రవీందర్, శరత్‌కుమార్‌రెడ్డి, రత్నాకర్, తాళ్లూరి దిలీప్, ఊటుకూరి విజయలక్ష్మి, రాధమ్మ, దేవరకొండ కళ్యాణి, తన్నీరు లలిత, ప్రీతి, కొప్పుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపికకు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం పోటీలు నిర్వహించారు. అండర్–8, 10, 12, 14, 16, 18 విభాగాలతో పాటు సీనియర్ పురుషుల, మహిళల విభాగాల నుంచి 60మంది అథ్లెట్లు హాజరయ్యారు. అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యాన పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన వారితో జిల్లా జట్లను ఎంపిక చేశారు. జూనియర్స్ జట్టు హనుమకొండలో, సబ్ జూనియర్ జట్లు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నాయి. ఆయా జట్లకు టి.రిణిత్, ఎం.వివేక్, జి.ఉత్తేజ్, నాయక్, ఇమీష్ ప్రీత్, బి.భానుప్రకాష్, ఉపేక్షిత్, డి.దినేష్, తమన్ కార్తీక్, వరుణ్, కె.విజయరామ అరవింద్, ఈ.పవన్‌కుమార్, బి.ప్రసన్నకుమార్, ఎం.మురళీకృష్ణ, బి.హరీష్, కె.వేణు, హాజీరా ఫాతిమా ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు. కాగా, జట్లను కలెక్టర్ దివాకర అభినందించగా అథ్లెటిక్స్ అకాడమీ చీఫ్ కోచ్ ఎం.డీ.గౌస్, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు ఎం.డీ.షఫీక్‌అహ్మద్, కృష్ణయ్య, రవికుమార్, రవి పాల్గొన్నారు.
మానవాళి విముక్తి
సిద్ధాంతమే మార్క్సిజం
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
తమ్మినేని వీరభద్రం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజలను దోపిడీ నుంచి విముక్తి చేసే సిద్ధాంతమే మార్క్సిజం అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభధ్రం అన్నారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బండారు రమేష్ అధ్యక్షతన కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా ‘మార్క్సిజం సమకాలీనత – సవాళ్లు’ అంశంపై చర్చా గోష్టి నిర్వహించగా ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారీ సమాజంలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతోందన్నారు. ఇది ఇప్పుడు యుద్ధ రూపంలో ప్రపంచాన్ని కబళించేలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.. అంతేకాక నిరుద్యోగం, ధరల పెరుగుదల సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ సంక్షోభ సమయాన ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాగా, కమ్యూనిస్టుల బలం కేవలం ఓట్లు, సీట్లలో కాకుండా.. ప్రజలను ఐక్యం చేస్తూ ప్రజా ఉద్యమాలను నిర్మించే కృషిలో ఉంటుందని తమ్మినేని తెలిపారు. ఈ అవగాహనతో ప్రజలతో మమేకమై వారి పని చేయడం ద్వారా మార్క్స్‌కు నివాళి అర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు ఎం.సుబ్వారావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో పాటు బండి రమేష్, బోడపట్ల రవీందర్, రఫీ తదితరులు పాల్గొన్నారు.


