ప్రజల ముంగిట్లోకే పాలన | - | Sakshi
Sakshi News home page

ప్రజల ముంగిట్లోకే పాలన

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

● అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు ● ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి శ్రీనివాసరెడ్డి

● అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు ● ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి శ్రీనివాసరెడ్డి

నేలకొండపల్లి: రాష్ట్రంలో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో బుధవారం జరిగిన ప్రజాదర్బార్‌లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్‌ దివాకరతో కలిసి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ప్రజాదర్బార్‌ లక్ష్యమని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన రైతులు ఇబ్బంది పడితే తాము రుణమాఫీ చేయడమే కాక రైతుభరోసా ఇస్తున్నామని చెప్పారు. అలాగే, పండించిన ప్రతీ పంటను మద్దతు ధరతో కొనుగోలు చేస్తూనే సన్న ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు. కాగా, మే నెలాఖరు నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. భూ సమస్యలను భూభారతి ద్వారా ప్రక్షాళన చేస్తున్నామని, సాదాబైనామా దరఖాస్తులను రాబోయే 35 రోజులలో ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజాదర్బార్‌లో అందిన ప్రతీ న్యాయబద్ధమైన దరఖాస్తును గరిష్టంగా మూడు నెలల్లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, వ్యక్తిగత సమస్యలపైనే కాక నేషనల్‌ హైవే నేలకొండపల్లిలో ఎగ్జిట్‌, కట్టలమ్మ చెరువు వద్ద వాకింగ్‌ ట్రాక్‌, మినీ స్టేడియం ఏర్పాటు, వంద పడకల ఆస్పత్రి, రామదాసు మందిరానికి ప్రహరీ, బాలసముద్రంలో బోటింగ్‌ ఏర్పాటు చేయాలని పలువురు వినతిపత్రాలు అందజేశారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డీపీఓ రాంబాబు, మార్కెట్‌ చైర్మన్‌ సీతారాములు, వివిధ పార్టీల నాయకులు శాఖమూరి రమేశ్‌, కొడాలి గోవిందరావు, మైశా శంకర్‌, జెర్రిపోతుల అంజని, పసుపులేటి శ్రీలత, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల సత్యనారాయణ, భద్రయ్య, కడియాల నరేశ్‌, మేకల వెంకటేశ్వర్లు, తిగుళ్ల భవాని, పాకనాటి కన్నారెడ్డి, చెరుకుపల్లి రాజేశ్‌, మందడి నాగశ్రీను, కర్ల ఆశోక్‌, ఆనం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement