● మార్గదర్శకాల ప్రకారం సాదాబైనామా దరఖాస్తుల క్లియరెన్స్ ● రెవెన్యూ శాఖపై సమీక్షలో కలెక్టర్ దివాకర
ఖమ్మంసహకారనగర్: రెవెన్యూ శాఖలో పెండింగ్ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తూ ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, భూభారతి, సాదాబైనామా, ప్రభుత్వ భూములు, పెండింగ్ సర్వేలు, ఇసుక, ఎస్‌ఐఆర్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనలో మార్గదర్శకాలను పాటిస్తూ పరిష్కరించాలని తెలిపారు. భూభారతి పెండింగ్ స్లాట్లను పరిశీలించి ప్రతిరోజు మూడు మండలాల ఫైళ్లను జిల్లాస్థాయికి పంపించాలన్నారు. ఆ తర్వాత రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల పరిష్కారం, ప్రభుత్వ భూముల లభ్యత, నేలకొండపల్లి మండలంలో రైస్ మిల్ ఏర్పాటుకు స్థల కేటాయింపు, ఓటర్ల జాబితా మ్యాపింగ్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సరఫరా తదితర అంశాలపై సమీక్షించిన కలెక్టర్ సూచనలు చేశారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్లు, పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
పనులు వేగంగా పూర్తి చేయండి
ఖమ్మంమయూరిసెంటర్: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సింథటిక్ ట్రాక్ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పరిశీలించిన ఆయన ట్రంక్ మెయిన్, ఎస్‌టీపీ కేంద్రం వివరాలు ఆరా తీశారు. ఆ తర్వాత సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్‌ను పరిశీలించి మిగిలిన పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఖిల్లా వద్ద రోప్ వే పనులను పరిశీలించిన కలెక్టర్ లోయర్ స్టేషన్ పాయింట్, కేబిన్ల తయారీపై సూచనలు చేశారు. పబ్లిక్ హెల్త్ డీఈ నవీన్‌కుమార్, ఏఈ నవ్యజ్యోతి, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, డీఈ రామకృష్ణ, ఏఈ నరేశ్ తదితరులు ఉన్నారు.
పంట అవశేషాలు కాలిస్తే
పర్యావరణానికి ముప్పు
ఖమ్మంవ్యవసాయం: పంట అవశేషాలను కాలిస్తే పర్యావరణానికి ముప్పుగా మారడమే కాక భూసారం దెబ్బతింటుందని కలెక్టర్ దివాకర్ తెలిపారు. అంతేకాక అవశేషాలను కాల్చడంతో సమీపంలోని పంటలు, ఆస్తులు, విద్యుత్ లైన్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు పర్యావరణాన్ని కాపాడేలా పంట అవశేషాలను కాల్చకుండా రోటొవేటర్ ద్వారా నేలలో కలియదున్నాలని సూచించారు. తద్వారా భూమి సారవంతమవుతుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.


