‘సుడా’ చైర్మన్‌గా పువ్వాళ్ల | - | Sakshi
Sakshi News home page

‘సుడా’ చైర్మన్‌గా పువ్వాళ్ల

May 7 2026 8:08 AM | Updated on May 7 2026 8:08 AM

● 29నెలల తర్వాత కొత్త కమిటీ నియామకం ● ఏజెన్సీ ప్రాంతాలు మినహా అంతా ‘సుడా’ పరిధిలోనే..

● 29నెలల తర్వాత కొత్త కమిటీ నియామకం ● ఏజెన్సీ ప్రాంతాలు మినహా అంతా ‘సుడా’ పరిధిలోనే..

ఖమ్మంమయూరిసెంటర్‌: స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సుడా) చైర్మన్‌గా పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ నియమితులయ్యారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్‌లో నాటి కమిటీని రద్దు చేయగా.. 29 నెలల తర్వాత కొత్త కమిటీ ఎంపికకు సంబంధించి చైర్మన్‌ను నియమించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం సుడా పరిధి కూడా పెరిగింది. రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు మినహా అన్ని మండలాలు, గ్రామాలు సుడా పరిధిలోకి వచ్చాయి.

విధేయతకు పట్టం

తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్ల పాటు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమాన రెండు పర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నుంచి ఎక్కువ స్థానాలను కాంగ్రెస్‌ కై వసం చేసుకుంది. అయితే, రెండు పర్యాయాలు డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఏఐసీసీ సూచనలతో దుర్గాప్రసాద్‌ డీసీసీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాగా, సుడా చైర్మన్‌గా పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌కు అవకాశం దక్కుతుందని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రచారం జరుగుతోంది. దీన్ని నిజం చేస్తూ బుధవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. 1984లో తొలిసారి కాంగ్రెస్‌లో సభ్యత్వం తీసుకున్న దుర్గాప్రసాద్‌ తొలుత వైరా గ్రామ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆతర్వాత 1987లో వైరా సహకార సంఘం ఎన్నికల్లో పోటీ చేశారు. 1993లో డైరెక్టర్‌గా గెలుపొందారు. 2001 నుంచి 2006 వరకు వైరా సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఫిబ్రవరి 10 వరకు ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2015లో డీసీసీ అధికార ప్రతినిధి నియమితులైన ఆయన 2018 ఏప్రిల్‌ నుంచి ఏడాది పాటు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ఇక 2019 ఫిబ్రవరి 10 నుంచి 2025 డిసెంబర్‌ 1 వరకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా పార్టీని వీడకుండా కొనసాగిన దుర్గాప్రసాద్‌ విధేయతను పరిగణనలోకి తీసుకుని జిల్లాలో కీలకమైన సుడా చైర్మన్‌ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement