ఖమ్మంమామిళ్లగూడెం/ఖమ్మం గాంధీచౌక్: రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్‌చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్, వైస్‌చైర్మన్లుగా ఉమ్మడి జిల్లా నేతలకు స్థానం దక్కింది. ఈమేరకు మున్నూరుకాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యాయవాది బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నియమితులయ్యారు. ఆయన నియామకంపై మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ హర్షం వ్యక్తం చేశారు. కాగా, శ్రీరామ్ తండ్రి, దివంగత ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు మున్నూరుకాపులతో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు.
● ఖమ్మంగాంధీచౌక్: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్‌గా బసవరాజ్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెంకు చెందిన ఆయన నియామకంతో జిల్లాకు ప్రాధాన్యత ఉంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ నియామకంపై నియోగి బ్రాహ్మణ స్వతంత్ర సేవా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోసూరి ప్రసాద్, గెంటేల శ్రీనివాసరావుతో పాటు చకిలం జనార్దన్‌రావు, వనం వెంకటప్పారావు, గోళ్లమూడి సత్యనారాయణ శర్మ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
● బోనకల్: కమ్మ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా పరుచూరి మురళి నియమితులయ్యారు. బోనకల్ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఆయనను వైస్ చైర్మన్‌గా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన నియామకంపై పీసీసీ సభ్యుడు పైడిపల్లి కిశోర్, ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు, నాయకులు, ప్రజాప్రతినిధులు గాలి దుర్గారావు, మోదుగు సుధీర్‌బాబు, పిల్లలమర్రి నాగేశ్వరరావు, భద్రునాయక్, తుళ్లూరి లక్ష్మీనర్సయ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
● భద్రాచలంటౌన్: భద్రాచలంకు చెందిన పీసీసీ సభ్యుడు బుడగం శ్రీనివాస్ పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ స్పందిస్తూ పెరిక సామాజిక వర్గ అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయనకు పలు వురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.


