● నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం
ప్రతీ ప్రసవం.. సురక్షితం
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ప్రభుత్వ ప్రసవాలు సురక్షితంగా జరిగేలా ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గర్భం దాల్చిన మహిళలు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో పేరు నమోదు చేసుకోవడం, వైద్యపరీక్షలు చేయించుకునేలా పర్యవేక్షిస్తామని వెల్లడించారు. వైద్యపరీక్షలు చేయించుకోవడం ద్వారా రక్తపోటు, రక్తహీనత, షుగర్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. అలాగే, గర్భిణులను పర్యవేక్షిస్తూ అవసరమైన వారిని ఉన్నత ఆస్పత్రులకు రిఫర్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అంతేకాక పోషకాహారం ప్రాముఖ్యత, ఐరన్, కాల్షియం మాత్రలు తీసుకోవడం, వ్యాక్సిన్ వేయించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు, సిబ్బంది, అవసరమైన మందులు, 24 గంటల వైద్యం అందుతుండడమే కాక అత్యవసర పరిస్థితుల్లో 102, 108 వాహనాలు సిద్ధంగా ఉన్నందున గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇళ్లలో ప్రసవాలతో పోలిస్తే ఆస్పత్రుల్లోనే సురక్షితం అయినందున కుటుంబీకులు సహకరించాలని డీఎంహెచ్‌ఓ కోరారు. తద్వారా ప్రతీ ప్రసవాన్ని సురక్షితంగా మార్చాలని సూచించారు.


