ఖమ్మంగాంధీచౌక్/ఖమ్మంమామిళ్లగూడెం: సివిల్స్ కోచింగ్ తీసుకోవాలని భావించినా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న చింతకాని మండలం నేరడకు చెందిన యాదా లావణ్యగుప్తకు ఆర్యవైశ్య మహాసభ బాధ్యులు అండగా నిలిచారు. ఈ మేరకు లావణ్యకు రూ.2.50 లక్షల ఆర్థిక సాయాన్ని బుధవారం జిల్లా జడ్జి జి.రాజగోపాల్ చేతుల మీదుగా అందజేశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, వివిధ సంస్థల బాధ్యులు పాపారావు, మంద కృష్ణ, దేవత అనిల్, గెల్లా శ్రీరామ్, గుర్రం ఉమామహేశ్వరరావు, రంగా వెంకటేశ్వర్లు, సుగుణావతి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ ఆర్థిక సాయం అందిందని తెలిపారు. కార్యక్రమంలో వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు పసుమర్తి చందర్‌రావు, కాళ్ల సూర్యకృష్ణ, పాల్వాయి వెంకటేశ్వరరావు, తేరాల ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఉన్నత చదువులకు రూ.1.50 లక్షలు..
ఖమ్మంసహకారనగర్: కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన గడ్డం వెంకటేశ్వర్లు ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాలలో బీబీఏ చదువుతూ క్యాట్ రాసి రూర్‌కేలా ఎన్‌ఐటీలో ఎంబీఏ ప్రవేశానికి అర్హత సాధించాడు. అయితే, ఆయన ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో కాలేజీ అధ్యాపకుడు సూరంపల్లి రాంబాబు సహకారంతో మిగతా అధ్యాపకులు, ఉద్యోగులు రూ.1.50 లక్షలు సేకరించి అందజేశారు. అలాగే, రెండో సెమిస్టర్ ఫీజుకు తాము చేయూతనిస్తామని ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు బయ్యన బాబూరావు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు డాక్టర్ బి.శ్రీనివాస్, డాక్టర్ కె.కిరణ్ కుమార్, సుజాత, దడిగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బతో రైతు మృతి
బోనకల్: మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన వ్యక్తి బుధవారం వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన కేశగాని కృష్ణయ్య (60) పొలంలో పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఎండ కారణంగా ఆయన ఇంటికి రాగానే సొమ్మసిల్లి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. వారం రోజులుగా ఎండలో పనిచేస్తుండడంతో వడదెబ్బ తాకి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
ఈతకు వెళ్లి బాలుడు...
● పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చి మృత్యువాత
కొణిజర్ల: నాయనమ్మతో కలిసి పెళ్లికి వచ్చిన ఓ బాలుడు స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లగా బావిలో మునిగి మృతి చెందాడు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలను ఎస్‌ఐ జి.సూరజ్ వెల్లడించారు. వైరా మండలం గొల్లపూడికి చెందిన బాల్ది వెంకటేశ్వర్లు – నాగేంద్ర దంపతుల కుమారుడు అరవింద్(13) బుధవారం ఉదయం తన నాయనమ్మ కౌసల్యతో కలిసి కొణిజర్ల మండలం చిన్నగోపతిలో బంధువుల ఇంట పెళ్లికి వచ్చాడు. అందరూ హడావిడిలో ఉండగా అరవింద్ తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపాన వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. బావి లోతు ఎక్కువగా ఉండడంతో ఈత సరిగా రాని అరవింద్ నీట మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాలుడిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. ఏడో తరగతి పూర్తిచేసిన అరవింద్ మృతితో వెంకటేశ్వర్లు దంపతుల రోదనలు మిన్నంటాయి.


