సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం
ఉదయం, సాయంత్రం బయటే మేలు
మధ్యాహ్నం ఎండ తాకకుండా ఇన్‌డోర్ గేమ్స్
దృష్టి మళ్లించాలి..
పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చారు. హాస్టళ్లు, గురుకులాల్లో ఉండే విద్యార్థులు ఇళ్లకు చేరుకున్నారు. ఈ సెలవుల్లో రోజూ ఆటలతో సరదాగా గడిపేద్దామని చిన్నారులు భావిస్తారు. వీరి కోరికను తల్లిదండ్రులు మన్నించినా ఒక క్రమపద్ధతిలో కొనసాగితేనే ప్రయోజనం ఉంటుంది. పిల్లల అభిరుచికి తగినట్లుగా మెదడు, శరీరానికి వ్యాయామం చేయించే ఆటలు ఆడిస్తే అటు మనోవికాసం.. ఇటు వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది.
– ఇల్లెందురూరల్
ఎండవేడిలో ఆరుబయట ఆడితే పిల్లలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇన్‌డోర్ గేమ్స్‌పై ఆసక్తి కలిగించాలి. ఇలాంటి ఆటలతో శారీరక కదలిక లేకపోయినా మెదడుకు పదును పెడుతాయి. పుస్తకాల్లో పజిల్స్ పూరించడంతో సమస్య పరిష్కారానికి ఉత్తమ మార్గాలు అన్వేషించే నైపుణ్యాలు అలవడుతాయి. క్యారమ్స్, చెస్‌తో ఏకాగ్రత, లక్ష్యంపై గురి ఏర్పర్చుకునే నైపుణ్యం పెరుగుతుంది. పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం, పాటలు పాడటం ద్వారా భాష, పఠనా నైపుణ్యాలతో పాటు పద సంపద పెరుగుతుంది.
మైదానాలు సిద్ధం చేయాలి
దాదాపు ప్రతీ గ్రామపంచాయతీలో క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. యువత వాలీబాల్, ఖోఖో, కబడ్డీ ఆడుకునేలా కోర్టులతో పాటు చిన్నారులు సరదాగా గడిపేందుకు జారుడు బల్లలు, ఊయలలు, ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. అయితే, నిర్వహణ లోపంతో కొన్ని పాడైనందున వేసవి సెలవుల నేపథ్యాన వీటిని శుభ్రం చేయించి అందుబాటులోకి తీసుకురావాలి. చిన్నారులు ఆడుకునేలా, వ్యాయామం చేసేలా కనీస సౌకర్యాలు కల్పించాలి.
ఏ ఆటలు ఎక్కడ ఆడాలంటే..
వాతావరణం చల్లగా ఉన్న సమయాన ఉదయం, సాయంత్రం ఆరుబయట క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, లాంగ్‌జంప్, బాస్కెట్‌బాల్, జాగింగ్ వంటి ఆటలు ఆడుకోవాలి. అందరికీ ఆసక్తి ఉండే ఈత విషయానికొచ్చేరికి రక్షణ సామగ్రి ధరించడం, నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకోవడం ప్రారంభించాలి. ఇక ఎండ వేడి అధికంగా ఉండే మధ్యాహ్న సమయాన నీడ ప్రదేశాల్లో చెస్, క్యారమ్స్, వైకుంఠపాళి ఆడుకోవచ్చు. ఇదే సమయాన పద వినోదం, కాగితాల వ్యర్థాలతో బొమ్మల తయారీ, పెయింటింగ్, పుస్తకాలు చదువుకోవడం వంటివి సాధన చేస్తే సెలవులు సద్వినియోగం అవుతాయి.
ఇవీ ప్రయోజనాలు
వ్యాయామం ప్రతీ వ్యక్తికి శారీరక దారుఢ్యాన్ని అందిస్తుంది. పరుగెత్తడం, ఎగరడం, దూకడం ద్వారా కండరాలు బలోపేతం అవుతాయి. జట్టు క్రీడలతో సాంఘిక జీవనం, స్నేహసంబంధాలు మెరుగవుతాయి. మైదానంలో ఆడే ఆటలు సమస్య పరిష్కారం, ఏకాగ్రత, విమర్శనాత్మక ఆలోచన, సమయోచిత నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. తాజా గాలి, సూర్యకాంతి యువతకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గిస్తాయి. లేలేత కిరణాలు ప్రసరించే సమయంలో ఎండకు ఉండటంతో శరీరానికి విటమిన్ డీ అందుతుంది. ఫలితంగా ఎముకలు బలపడుతాయి. అలాగే, శారీరక శ్రమతో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
సెలవుల్లో వడదెబ్బకు గురికాకుండా సమయానుకూలంగా క్రమపద్ధతిలో ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. తద్వారా పిల్లలకు ఆరోగ్యం, ఆహ్లాదం, ఆటవిడుపు లభిస్తాయి. అంతేకాక అందరితో కలిసిపోవడం అలవాటుగా మారుతుంది.
–డాక్టర్ మోతీలాల్,
చిన్నపిల్లల వైద్యుడు, ఇల్లెందు
ప్రస్తుతం అన్ని వయస్సుల వారు సెల్‌ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సమయం సెల్‌ఫోన్ చూడటం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలా కాకుండా సెలవుల్లో ిపిల్లలను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే ఆటల వైపు దృష్టి మళ్లించాలి. – డాక్టర్ కె.రఘు, పీడీ,
సుభాష్‌నగర్ హైస్కూల్, ఇల్లెందు మండలం


