ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యాన నిర్వహించనున్నట్లు ప్రకటించిన తెలంగాణ టీ–20 క్రికెట్ టోర్నీని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) జిల్లా అధ్యక్షుడు కూరపాటి ప్రదీప్ డిమాండ్ చేశారు. కేవలం హైదరాబాద్‌కే క్రికెట్‌ను పరిమితం చేసి, జిల్లాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను విస్మరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా క్రికెటర్లకు ఆవకాశం కల్పించాలని బీసీసీఐ చేసిన సూచనలకు భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇకనైనా హెచ్‌సీఏ తీరు మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రదీప్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
జూనియర్ కాలేజీల్లో
ప్రవేశాలకు కౌన్సెలింగ్
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల జూనియర్ కళాశాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 16, 18వ తేదీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని భద్రాదాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఓ ప్రకటనలో తెలిపారు. బాలుర కు ఈనెల 16న దమ్మపేట, కిన్నెరసాని డ్యాంసైడ్, గుండాల, కృష్ణసాగర్, సింగరేణి, తిరుమలాయపాలెం గురుకులాల్లో కోర్సుల వారీగా కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. అలాగే, 18వ తేదీన బాలికలకు భద్రాచలం, సుదిమళ్ల, అంకంపాలెం, అన్నపురెడ్డిపల్లి, మణుగూరు, కొత్తగూడెం, వైరా కాలేజీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి పాసైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని పీఓ సూచించారు.
షార్ట్‌సర్క్యూట్‌తో
అగ్ని ప్రమాదం
రూ.10 లక్షల విలువైన సామగ్రి దగ్ధం
ఖమ్మంక్రైం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఖమ్మంలోని ఓ ఆటోమొబైల్ షాప్‌లో సోమవారం అర్ధరాత్రి దాటాక అగ్ని ప్రమాదం సంభవించింది. జమ్మిబండ ప్రాంతంలోని అయ్యప్ప ఆటోమొబైల్స్ దుకాణాల నిర్వాహకులు సోమవారం రాత్రి మూసివేసి వెళ్లిపోయారు. అయితే, అర్ధరాత్రి దాటాక షాపులో నుంచి పొగలు వస్తున్నాయని స్థానికులు యజమానితో పాటు అగ్నిమాపక శాఖ, పోలీస్ సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ అధికారి కోదండరామిరెడ్డి ఆధ్వర్యాన సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రధాన రహదారిపై షాపు ఉండడంతో సమీప షాప్‌లకు మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో ప్రమాదం తప్పినట్లయింది. షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించగా, ఆటోమొబైల్ షాపులో సుమారు రూ.10 లక్షల విలువైన సామగ్రి కాలిపోయిందని అంచనా వేశారు.


