తండ్రి కళ్ల ముందే చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

తండ్రి కళ్ల ముందే చిన్నారి మృతి

May 6 2026 8:19 AM | Updated on May 6 2026 8:19 AM

మధిర: సెలవుల్లో ఇంటికి వచ్చిన బంధువుల పిల్లలతో పాటు తన పిల్లలను సమీపంలోని వైరా నదిపై బ్రిడ్జిని చూడాలని చెప్పడంతో ఆయన అందరినీ తీసుకెళ్లాడు. అక్కడ లోతైన గుంతను గమనించక చిన్నారులు మునిగిపోతుండగా.. ముగ్గురిని కాపాడినప్పటికీ తన కుమార్తెను మాత్రం రక్షించుకోలేకపోయాడు. కడుపున పుట్టిన బిడ్డ కళ్ల ముందే కన్నుమూయడంతో ఆ తండ్రి రోదనలు మిన్నంటాయి. మధిర మండలం వంగవీడులో మంగళవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలు...

నలుగురు పిల్లలను తీసుకుని..

వంగవీడుకు చెందిన గుడిద జితేంద్ర ఇంటికి సెలవుల్లో బంధువుల పిల్లలు వచ్చారు. గ్రామ సమీపంలోని వైరా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జిని చూడాలని కోరడంతో ఆయన తన పెద్ద కుమార్తె చైత్ర, చిన్న కుమార్తె దీక్షితతో పాటు బంధువుల పిల్లలను తీసుకుని వెళ్లాడు. అక్కడ వైరా నదిలో పిల్లలు సరదాగా స్నానం చేస్తూ బ్రిడ్జి పిల్లర్‌ వద్దకు వెళ్లాడు. అక్కడ లోతైన గుంత ఉందని తెలియకపోవడంతో పిల్లలంతా నీట మునిగారు. దీంతో జితేంద్ర చైత్ర సహా ముగ్గురు పిల్లలను రక్షించినా చిన్న కుమార్తె దీక్షితను మాత్రం కాపాడలేకపోయాడు. కాసేపటికి ఆమెను బయటకు తీసి మధిర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సరదాగా పిల్లలను బయటకు తీసుకెళ్లి ఓ కుమార్తెను కోల్పోయిన జితేంద్ర కుటుంబీకులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. కాగా, దీక్షిత మధిరలోని ఒక ప్రైవేట్‌ స్కూల్లో ఆరో తరగతి పూర్తి చేసింది. ఘటనపై మధిర రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

సరదాగా నీళ్లలో ఆడుతూ

మునిగిపోవడంతో ప్రమాదం

Advertisement
 
Advertisement
Advertisement