వివిధ పథకాల ద్వారా...
గోళ్లపాడు చానల్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, పార్కుల సుందరీకరణ ఇంకొన్ని సమస్యలు ఉన్నా.. మారిన ఖమ్మం రూపురేఖలు ఈనెల 7వ తేదీతో ముగియనున్న పాలకవర్గం గడువు
ఆ నిధులే ఎక్కువ..
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. డివిజన్లలో మౌలిక వసతుల కల్పన మొదలు పార్కులు, ఇతర సౌకర్యాలు కల్పించడంలో కేఎంసీ పాలకవర్గం, అధికారులు కృషి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గం 2021 మే 7న బాధ్యతలు చేపట్టగా ఈనెల 7వ తేదీతో గడువు ముగియనుంది. ఈ ఐదేళ్ల కాలంలో పాలకవర్గం, అధికారుల కృషితో వివిధ రూపాల్లో రూ.830.67 కోట్ల నిధులు రాబట్టి ఖమ్మంను రాష్ట్రంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దారు. శివారు ప్రాంతాలు, కొన్ని కాలనీల్లో సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో వసతులు సమకూరాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ పెద్దమొత్తంలో నిధులు రావడం విశేషం.
రూ.410 కోట్ల పబ్లిక్ హెల్త్ నిధులతో..
మరో రూ.410 కోట్ల పబ్లిక్ హెల్త్ నిధులు కేఎంసీ అభివృద్ధికి కేటాయించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్‌ఐడీసీ) ద్వారా రూ.80 కోట్లు అందాయి. ఈ నిధులను నగరంలో మౌలిక వసతుల కల్పన, సుందరీకరణకు కేటాయించారు. అలాగే అమృత్–1 ద్వారా రూ.230 కోట్లు, అమృత్–2.0 ద్వారా రూ.50 కోట్లు కేటాయించారు. దీంతో ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేస్తున్నారు. అలాగే భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వర్షపునీరు నిల్వ ఉండకుండా డ్రెయిన్లు నిర్మాణంలో ఉన్నాయి. నగరంలో త్రీటౌన్ ప్రాంతంలో మురికి కూపంగా ఉన్న గోళ్లపాడు చానల్ ఆధునికీకరణ, సుందరీకరణ కోసం రూ.50 కోట్లు వెచ్చించారు. మురుగునీరు, వర్షపునీరు వేర్వేరుగా వెళ్లేలా డ్రెయినేజీలు నిర్మించడమే కాకుండా.. గోళ్లపాడు చానల్‌పై అందమైన పార్కులు ఏర్పాటు చేయడంతో స్థానికులకు ఆహ్లాదం అందుబాటులోకి వచ్చింది. ఈ పార్కుల్లో చిన్నారులు ఆడుకోవడానికి పరికరాలు ఏర్పాటు చేయడంతోపాటు గ్రంథాలయాలు, వాకింగ్‌ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లను నిర్మించారు. ఇక ఎన్నెస్పీ కెనాల్‌పై వాక్‌వేలు, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులను కోసం ప్రభుత్వం నుంచి వివిధ రకాల నిధులు విడుదలయ్యాయి. ఇందులో జనరల్ ఫండ్‌తోపాటు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్‌డీఎఫ్), సీఎం అసూరెన్స్, 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా వచ్చిన నిధులు, ఎంపీ లాడ్స్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, నియోజకవర్గాల అభివృద్ధి నిధులు ఉన్నాయి. ఇవి మొత్తం రూ.150 కోట్లు కాగా, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి రూ.270 కోట్లు అందాయి. మొత్తంగా రూ.420 కోట్లతో డివిజన్లలో వసతుల కల్పన, సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే చాలాచోట్ల పనులు పూర్తికాగా, ఇంకొన్ని చోట్ల పురోగతిలో ఉన్నాయి. అంతేకాక తాగునీటి సౌకర్యం, పార్కుల ఆధునికీకరణకు భారీగానే నిధులను వెచ్చించారు. ప్రత్యేక నిధుల ద్వారా సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇవి కాకుండా ప్రస్తుతం రూ.180 కోట్లతో మున్నేరుపై నిర్మిస్తున్న తీగల వంతెన పూర్తయితే ఖమ్మంకు మణిహారంగా నిలవనుంది.
నిధుల వరదతో కేఎంసీ అభివృద్ధి బాట
ఐదేళ్ల కాలంలో వెచ్చించిన మొత్తం నిధుల్లో జనరల్ ఫండ్, ఎస్‌డీఎఫ్ (ప్రత్యేక అభివృద్ధి నిధులు), ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా వచ్చిన నిధులే అత్యధికంగా ఉన్నాయి. మున్సిపల్ జనరల్ ఫండ్ రూ.58,48,52,000 కాగా.. ఎస్‌డీఎఫ్ రూ.55,60,02,000 ఉన్నాయి. ఇక ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రూ.22,79,40,000 నిధులు సమకూరాయి. అంతేకాక జనరల్ ఫండ్ నిధులతో పాటు ఆస్తి పన్ను, నీటి పన్ను, వివిధ రకాల అనుమతులు, జరిమానాలు, ఇతర వనరుల నుంచి కేఎంసీకి ఈ సొమ్ము సమకూరింది. అలాగే ఎస్‌డీఎఫ్ ద్వారా స్థానిక సమస్యలను పరిష్కరించడంతోపాటు నిధుల కొరతతో ఆగిన పనులను పూర్తి చేశారు. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు వెచ్చించారు.


