ఇవీ అర్హతలు
● విద్యుత్ ఉద్యోగుల్లో ఊగిసలాట ● రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్కం ఏర్పాటుకు సన్నాహాలు ● ఇతర డిస్కంల్లోని ఉద్యోగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ పంపిణీ కోసం రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న డిస్కంలకు తోడు ప్రభుత్వం కొత్తగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీ ఆర్పీడీసీఎల్)ను ఏర్పాటుచేస్తోంది. వ్యవసాయ సంబంధిత కనెక్షన్ల నిర్వహణ, విద్యుత్ పంపిణీతో పాటు ప్రభుత్వ నీటి సరఫరా పథకాల నిర్వహణ కోసం ఈ డిస్కంను ఏర్పాటుచేస్తున్నట్లు చెబుతున్నారు. ఈమేరకు ప్రస్తుత డిస్కంల్లోని ఉద్యోగులే ఇందులో విధులు నిర్వర్తించేందుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, టీజీ ట్రాన్స్‌కో, టీజీ జెన్‌కోల్లో ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు బదిలీలకు అర్హులుగా నిర్ణయించారు. అయితే, కొత్త డిస్కంలోకి వెళ్లాలా, వద్దా అన్న మీమాసంలో ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త డిస్కంలో తక్కువ మంది ఉద్యోగులే ఉండనుండడంతో త్వరగా పదోన్నతులు వస్తాయని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉన్నందున ఇబ్బందులు ఎదురవుతాయనే భావనలో ఉన్నట్లు సమాచారం.
అందుబాటులో పోర్టల్
రైతు డిస్కంలోకి రావడానికి ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటుచేసిన పోర్టల్ ఏప్రిల్ 30న అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు ఉద్యోగులు ఈనెల 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకుంటే 12వ తేదీలోగా అర్హతలను పరిశీలిస్తారు. ఆతర్వాత ఎంపిక చేసిన వారికి ఈనెల 13న ఉత్తర్వులు ఇవ్వనుండగా.. ప్రస్తుత స్థానంలో 15న రిలీవ్ అయి రైతు డిస్కంలో 18వ తేదీ నాటికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ 19వ తేదీన జారీ చేసే పోస్టింగ్ ఆర్డర్ల ఆధారంగా ఈనెల 25వ తేదీ వరకు కేటాయించిన స్థానంలో చేరాలి.
కమిటీ వేయాలి
ప్రభుత్వం నూతనంగా రూపొందించిన డిస్కం విధివిధానాలపై కమిటీ వేయాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేస్త్తోంది. ఇటీవల రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ అలీ ఫరూక్‌తో యూనియన్ ప్రతినిధులు సమావేశమై బదిలీలకు సంబంధించి చర్చించారు. రైతు డిస్కంపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న డిస్కంల కన్నా ప్రత్యేక రైతు డిస్కంతో కొత్తగా జరిగే మేలు ఏమీ ఉండనందున.. ప్రతిపాదనపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక ప్రస్తుతం ఉన్న డిస్కంల నుంచి ఉద్యోగులు వెళ్తే ఖాళీలు పెరిగి ఇబ్బందులు వస్తాయని సీఎండీకి వివరించారు.
ఏం చేద్దాం?
రైతు డిస్కంలో వెళ్లాలా, వద్దా అన్న మీమాంసలో విద్యుత్ ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. తొలిదశలోనే దరఖాస్తు చేసుకుని వెళ్లే పదోన్నతులు త్వరగా వస్తాయని, ఇతర బెనిఫిట్లలోనూ ముందు ఉంటామని కొందరు భావిస్తున్నారు. ఇదే సమయాన వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లు, ప్రభుత్వ నీటి సరఫరా పథకాల నిర్వహణ కోసం ఏర్పాటుచేస్తున్న డిస్కం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుందని ఇంకొందరు చెబుతున్నారు. మరోపక్క డిస్కం ఏర్పాటు ప్రతిపాదననే వెనక్కి తీసుకోవాలని యూనియన్లు కోరుతున్నందున ఉద్యోగులు డోలాయమానంలో పడినట్లు తెలుస్తోంది.
కొత్త డిస్కంలోకి వెళ్లేందుకు అధికారులు, ఉద్యోగులకు కనీస సేవా కాలాన్ని కూడా నిర్దేశించారు. ఎస్‌ఈ తత్సమన అధికారులకు ఏడాది, డీఈల నుంచి కింది స్థాయి అధికారులు, ఫోర్‌మెన్లు కింది స్థాయి ఉద్యోగులైతే రెండేళ్ల పదవీ కాలం పూర్తయితే అర్హులుగా నిర్ణయించారు. అర్హతల, టీజీఆర్పీడీసీఎల్(రైతుడిస్కం) పాలసీ మేరకు పదోన్నతులు ఉంటాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అయితే, ఏసీబీ, క్రిమినల్ వంటి కేసులు నమోదై వారిని బదిలీకి అనర్హులుగా ప్రకటించారు. వేతనాలు, అలవెన్సులు, సర్వీస్ ప్రొటెక్షన్ వంటివి నిబంధన మేరకు ఉంటాయని.. ఈపీఎఫ్, జీపీఎఫ్, పెన్షన్ యథాతధంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.


