అర్హతే ప్రామాణికం | - | Sakshi
Sakshi News home page

అర్హతే ప్రామాణికం

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

మూడు నెలల్లో దరఖాస్తుల పరిష్కారం

సాదాబైనామాలకు

35 రోజుల్లో మోక్షం

ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి

పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మంరూరల్‌: ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని.. ఇందులో రాజకీయాలకు తావు లేకుండా అర్హతలనే ప్రామాణికంగా తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అర్హత కలిగిన ఉన్న ప్రతీ దరఖాస్తుకు మూడు నెలల్లో పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఖమ్మం రూరల్‌ మండలం మంగళగూడెంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆయన కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.తో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు, దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారరంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ ద్వారా ఎదురైన ఇబ్బందులను, తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ద్వారా తొలగిస్తున్నామని పేర్కొన్నారు. సాదాబైనామా దరఖాస్తులను అర్హత మేరకు రానున్న 35 రోజుల్లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అయితే సాదాబైనామా పేరుతో ప్రభుత్వ భూములను కాజేయాలని చూస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.

ఇళ్ల కోసమే ఎక్కువ

సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వాన పేదలు, మహిళలు, నిరుద్యోగ యువత పక్షాన తమ ప్రభుత్వం నిలబడుతోందని పొంగులేటి తెలిపారు. ఇప్పటివరకు పాలేరు నియోజకవర్గంలోని ఏడు క్లస్టర్ల పరిధిలో ప్రజాదర్బార్లు నిర్వహించగా పది వేల దరఖాస్తులు అందితే, అందులో 5వేలు వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఉన్నాయని చెప్పారు. ఈమేరకు త్వరలోనే రెండో దశ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.

వృద్ధురాలికి భరోసా

ప్రజాదర్బార్‌కు వచ్చిన గోళ్లపాడు గ్రామానికి చెందిన వందేళ్ల వృద్ధురాలు వెలుతురు భద్రమ్మ తన భూసమస్యను మంత్రి పొంగులేటికి విన్నవించింది. దీంతో సమస్యను విని వివరాలు తెలుసుకున్న ఆయన పరిష్కారంపై సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, ఆర్‌డీఓ శ్రీనివాస్‌, మంగళగూడెం సర్పంచ్‌ మేకల సత్యనారాయణ, ఉపసర్పంచ్‌ అన్నేటి అనిల్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నేడు గువ్వలగూడెంలో...

నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో బుధవారం ప్రజాదర్బార్‌ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని దరఖాస్తులు స్వీకరిస్తారు. గువ్వలగూడెం క్లస్టర్‌ పరిధిలోని అనాసాగారం, సదాశివాపురం, ముజ్జుగూడెం, నాచేపల్లి, ఆచార్లగూడెం, ఆరెగూ డెం, కోనాయిగూడెం, అమ్మగూడెం, నేలకొండపల్లి గ్రామాల ప్రజలు మధ్యాహ్నం 3గంటల నుంచి జరిగే ప్రజాదర్బార్‌లో దరఖాస్తులు ఇవ్వొచ్చని మార్కెట్‌ మాజీ చైర్మన్‌ శాఖమూరి రమేష్‌, నాయకులు కొడాలి గోవిందరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement