శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడిని పవిత్ర ప్రేమతో పూజించాలని.. అప్పుడే స్వామి అనుగ్రహం లభిస్తుందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఉద్బోధించా రు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ బాలా జీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు మంగళవారం హాజరైన ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక భావన, నైతిక విలువలు నెలకొల్పే ప్రధాన కేంద్రాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రతీఒక్కరూ నేను, నాది అనే అహం విడిచిపెట్ట డమే కాక మానవజాతికి గతి, గమ్యం, దిక్కు, రక్షకుడు దేవుడేనని గుర్తించాలని సూచించారు. ఆలయాలు, ఆలయ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు. అలా కాకుండా ఆలయ వ్యవస్థ చెడితే సమాజానికే అరిష్టమని స్పష్టం చేశారు. వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన బాలాజీ ఆలయానికి రెండేళ్ల క్రితం వచ్చానని జీయర్ స్వామి గుర్తు చేసుకున్నారు, ఆలయ నిర్మాణకర్తలు 2,232 ఎకరాలు భూమి ఇచ్చారని, ఆ రోజుల్లోనే గర్భాలయం, అర్థమండపం, ముఖ మండపం, బేడామండపంతో కూడిన సువిశాల ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ఆలయంలో ప్రస్తుతం మహాకుంభాభిషేకాన్ని ముందుండి నడిపిస్తున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణను జీయర్‌స్వామి అభినందించారు. తొలుత ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యాన జీయర్‌స్వామిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దంపతులతోపాటు సర్పంచ్ లాకావత్ లక్ష్మి, మేనేజర్ పాకాల వెంకటరమణ, కమిటీ సభ్యులు పర్సా వెంకటేశ్వర్లు, బొంకూరి సురేష్, వనమా శ్రీనివాసరావు, సత్యనారాయణరెడ్డి, బోడా పద్మ, శ్రీను, శివాలయ పునఃనిర్మాణకర్త మారగాని శ్రీనివాసరావు, చైర్మన్ మల్లాల నర్పింహారావు, వనమా గాంఽధీతో పాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


