
నవ్వుదాం.. నవ్విద్దాం...
● మానసిక స్థితిని మెరుగుపరిచే ఔషధం నవ్వు ● ఐక్యతను ప్రోత్సహించే సాధనం కూడా.. ● జిల్లా నుంచి కమెడియన్లుగా రాణిస్తున్న పలువురు
నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం
ఖమ్మంగాంధీచౌక్: నవ్వడం ఒక యోగం.. నవ్వకపోవడం రోగం అనేది నానుడి. అందుకే నవ్వు, నవ్వించు.. ఆరోగ్యంగా జీవించు అని పెద్దలు చెబుతుంటారు. ఈ కోవలోకి వచ్చేలా నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ అంటూ రచయితలు సినీ గేయాలు రూపొందించారు. నవ్వుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి హాస్య ప్రియుల కోరిక మేరకు అంతర్జాతీయ నవ్వుల యోగా ఉద్యమ మార్గదర్శి డాక్టర్ మదన్ కటారియా 1998లో ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ప్రకటించారు. అప్పటి ఏటా నుంచి మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యాన జిల్లా నుంచి హాస్యనటులుగా, స్టాండప్ కమెడియన్లుగా రాణిస్తున్న వారిపై కథనం
అందె వేసిన హాస్య కళాకారులు
ఖమ్మంకు కళల గుమ్మంగా పేరు. ఈక్రమాన ఇక్కడ హాస్య కళాకారులు కూడా ఉన్నారు. సినీ చరిత్రలో గొప్ప హాస్య నటుడుగా పేరొందిన బాబూమోహన్ స్వస్థలం జిల్లాలోని బీరోలు. మరో హాస్య నటుడు యరమల శ్రీనివాసరెడ్డిది సైతం కల్లూరు మండలం చినకోరుకొండి. వీరిద్దరు చలన చిత్ర పరిశ్రమలో హాస్య నటుడుగా పేరు సాధించారు. వీరేకాక మరికొందరు హాస్యనటులు జిల్లా నుంచి రాణిస్తుండగా స్టాండప్ కమెడియన్లుగానూ పలువురు నవ్వులు పండిస్తున్నారు.
స్టాండప్ కమెడియన్.. గుణకర్
ఖమ్మంకు చెందిన మొగిలి గుణకర్ స్టాండప్ కమెడియన్‌గా గుర్తింపు పొందారు. నేటి తరం వారిని ఆకట్టుకనేలా ప్రదర్శనలు ఇవ్వడం ఆయన ప్రత్యేకత. వైరా మండలం తాటిపూడికి చెందిన ఈయన అసలు పేరు ఏరుమొగిలి వెంకటేశ్వర్లు కాగా.. సినిమాలపై ఆసక్తితో కమెడియన్‌గానే కాక యాంకర్‌గా, పేరడీ సింగర్‌గా పేరు సాధించారు. మందుబాబుల తీరుపై ఆయన పాడే పాటలు ఆకట్టుకుంటాయి. బీఏ, బీఈడీ చదివిన గుణకర్ 25ఏళ్లలో 4వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, సినీ నటుడు బ్రహ్మానందం తదితరుల చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు.
నవ్వుల భద్రం
ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన బంక భద్రం తన ప్రదర్శనలతో నవ్వుల భద్రంగా స్థిరపడ్డారు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి.. ఓ చానెల్ నిర్వహించిన షోలో రూ.2 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు. ఎస్‌వీ.కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మస్త్’ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం అసిస్టెంట్‌గా నటించిన భద్రం.. బ్రహ్మానందంపైనే సైటెర్లు వేసే పాత్రతో అందరినీ అలరించారు.
హాస్యరస చక్రవర్తి ఈశ్వర్
ఖమ్మంకు చెందిన ఈశ్వర్ బహుదూర్ ఇరిగేషన్ శాఖలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూనే.. కమెడియన్‌గానూ రాణిస్తున్నారు. పలు చానళ్లు నిర్వహించే కామెడీ షోల్లో తరచుగా కనిపించే ఈశ్వర్ హాస్య రస చక్రవర్తి బిరుదును సొంతం చేసుకున్నారు. సినీ నటుడిగా రాణిస్తున్న ఆయనకు మూఖాభినయం, పేరడీ పాటల్లో మంచి పేరు ఉంది.
నవ్వుదాం హాయిగా..
నవ్వు మనిషికి ఆరోగ్యానిస్తుంది. మానవ మస్తిష్కంలో సంతోషాన్ని నింపేలా నాలుగు ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా గుండెల నిండా హాయిగా నవ్వొచ్చు. నవ్వడం తప్పేం కాదని గుర్తించి హాయిగా నవ్వుతూ ఇతరులతోనూ పంచుకోవాలి.
– తాళ్లూరి లక్ష్మి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, ఖమ్మం
నవ్వు సాధనతో ఉపయోగాలు..
నవ్వును వ్యాయామంగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆనందం, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అన్నివర్గాల వారు ఒత్తిడి తగ్గింపునకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. రోజూ 10 – 15 నిమిషాలు నవ్వు సాధన చేస్తే ఫలితముంటుంది.
– మరికంటి వెంకట్, ట్రెయినర్, ఖమ్మం

నవ్వుదాం.. నవ్విద్దాం...

నవ్వుదాం.. నవ్విద్దాం...

నవ్వుదాం.. నవ్విద్దాం...

నవ్వుదాం.. నవ్విద్దాం...

నవ్వుదాం.. నవ్విద్దాం...

నవ్వుదాం.. నవ్విద్దాం...