
మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు..
వైరా: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాదులు అధికారంలోకి రావడానికి నీచంగా దిగజారి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని, దేవుడిని అడ్డం పెట్టుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయం కూల్చేస్తారంటూ ప్రధాని మోదీ ప్రజలను భయాందోళనలకు గురిచేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైరా అమరవీరుల నగర్‌లో మాస్‌లైన్ జిల్లా రాజకీయ శిక్షణా తరగుతులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మణిపూర్, గుజరాత్‌లో మైనార్టీలు, దళితులు, ఆదివాసీలను దారుణంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పదేళ్ల కాలంలో ఉన్న ఉద్యోగాలు తొలగించారని ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం ఖాయమన్నారు. మత చాందస శక్తులను ఉసిగొల్పుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. దేశంలో పౌర హక్కులను కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యంగా పోరాడి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మతతత్వ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. శిక్షణ తరగతుల్లో పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కేంద్ర కమిటీ సభ్యుడు కె.జి. రామచందర్ ప్రసగించగా, సీ వై పుల్లయ్య ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. నాయకులు కె.అర్జునరావు, గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, జి రామయ్య, అవుల అశోక్, వెంకటరెడ్డి, శివలింగం, శిరోమణి, లలిత, ఝాన్సీ, లక్ష్మి, శ్రీనివాస్, లాజర్, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, అప్పారావు, సత్యం, వెంకటేశ్వర్లు, లాలమ్మ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.
మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు