మారెమ్మా.. కాపాడమ్మా | - | Sakshi
Sakshi News home page

మారెమ్మా.. కాపాడమ్మా

May 14 2026 12:43 AM | Updated on May 14 2026 12:43 AM

మండ్య: నగరంలో మారెమ్మ దేవర పండుగ వైభవంగా జరిగింది. హోసహళ్లి–రామనహళ్లి లేఔట్‌లోని శ్రీ బిసిలు మారెమ్మ దేవస్థానానికి వచ్చిన అశేష భక్తజనం ఊరేగింపులో పాల్గొన్నారు. కొబ్బరికాయలు, పూలు పండ్లు తదితరాలను అమ్మవారికి సమర్పించి పూజలు చేశారు. గతంలో మండు వేసవిలో ప్రజలు, పశువుల ఆరోగ్యం దెబ్బతినడంతో ప్రజలు కాపాడాలని అమ్మవారికి జాతర చేయడంతో అంతా మంచే జరిగిందని నమ్ముతారు. అలా వేసవిలో జాతరకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఐదేళ్లకొకసారి ప్రతి ఇంట్లోని అక్కా చెల్లెళ్లు, వదినా–మరదళ్లు కలసికట్టుగా ఈ పండుగను ఆచరిస్తారని చెప్పారు.

సీఎం సిద్దు.. మరిచారా: నిఖిల్‌

మైసూరు: అసెంబ్లీలో జేడీఎస్‌ బలం 17 స్థానాల నుంచి ఒక్క అంకెకు పడిపోతుందని సీఎం సిద్ధరామయ్య అపహాస్యం చేశారని, వరుణ నియోజకవర్గంలోనే తాను ఈ సవాలును స్వీకరిస్తున్నట్లు జేడీఎస్‌ పార్టీ యువ నాయకుడు నిఖిల్‌ కుమారస్వామి చెప్పారు. వరుణ వద్ద మెల్లహళ్లిలో బుధవారం ప్రజలతో మాట్లాడారు. 2004లో జేడీఎస్‌ పార్టీ 58 స్థానాలు గెలుపొందిందని, 2028 ఎన్నికల్లో అంతకంటే ఒక్క స్థానం ఎక్కువే గెలిచి ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మిమ్మల్ని చాంపియన్‌ చేసింది ఎవరో మరిచిపోయారా అని సిద్దరామయ్యను విమర్శించారు. తమ జేడీఎస్‌ పార్టీ ద్వారా ఎదిగి, ఆ తర్వాత తిన్నింటికే ద్రోహం చేశారని మండిపడ్డారు.

కంట్లో కారంపొడి చల్లి దోపిడీ

స్నేహితుడే సూత్రధారి

గౌరిబిదనూరు: నగరంలో సోమవారం మధ్యాహ్నం వినాయకనగర నివాసి శివశంకర్‌ ఆరాధ్యకు కారు కొనిస్తామని చెప్పి నమ్మించిన యశ్వంత్‌, అతని స్నేహితులు కంట్లో కారంపొడి చల్లి రూ 7.5 లక్షలున్న బ్యాగుతో పరారయ్యారు. బాధితుడు మాట్లాడుతూ నాకు యశ్వంత్‌ మూడు నెలల క్రితం పరిచయమయ్యాడు. కారును బాడుగకు తిప్పితే మంచి లాభముందని, తక్కువ ధరకు కారును కొనిస్తానని నమ్మించాడని తెలిపాడు. డబ్బు తీసుకుని ఇంట్లో ఉండగా యశ్వంత్‌ పిలుచుకెళ్లాడని, ఇంతలో బైక్‌లో వచ్చిన దుండగులు తన కంట్లో కారంపొడి చల్లి, కత్తితో దాడి చేసి రూ.7.5 లక్షల నగదుతో పరారైనట్లు తెలిపాడు. ఫిర్యాదు మేరకు క్రైం బ్రాంచ్‌ ఎస్‌ఐలు లలిత, వరలక్ష్మి సిబ్బంది మంగళవారం ఉదయానికల్లా దొంగలను అరెస్టు చేసి సొమ్మును స్వాధీన పరచుకొన్నారు. బెంగళూరు బిడదికి చెందిన భరత్‌, దర్శన్‌, విషకంఠ, యశ్వంత్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

నేడు పలు జిల్లాలకు వర్షసూచన

బనశంకరి: ఉత్తర ఒళనాడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది, అలాగే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం బెంగళూరుతో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కరావళిలో ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపిలో సాధారణ వర్షం కురవనుంది. ఉత్తర ఒళనాడులో బెళగావి, ధార్వాడ, గదగ్‌, హావేరి, కొప్పళ, రాయచూరులో సాధారణ వానలు పడవచ్చు. దక్షిణ ఒళనాడు జిల్లాలైన బళ్లారి, బెంగళూరు గ్రామాంతర, చామరాజనగర, చిక్కబళ్లాపుర, చిక్కమగళూరు, చిత్రదుర్గ, దావణగెరె, హాసన్‌ తదితర జిల్లాలకూ ఓ మోస్తరు వర్షసూచన ఉంది. రాబోయే 5 రోజులపాటు ఉత్తర ఒళనాడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీల మేర అధికం కావచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement