బొమ్మనహళ్లి: క్రీడా ప్రియులకు శుభవార్త. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని సూర్యనగర్ దగ్గర ఇండ్లవాడి వద్ద 80 వేల సీట్ల సామర్థ్యం గల అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సీఎం సిద్దరామయ్య ఈ నెల 23వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. స్టేడియం నిర్మాణం కోసం కర్ణాటక హౌసింగ్ బోర్డు ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది, త్వరలో టెండర్ల ప్రక్రియను ఖరారు చేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇక్కడ సుమారు 75 ఎకరాల స్థలంలో ఆధునిక హంగులతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పనులు మొదలైన మూడేళ్ల లోపు స్టేడియం పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఆ దుర్ఘటన నుంచి పాఠం..
గతేడాది జూన్‌లో బెంగళూరు నడిబొడ్డున చిన్నస్వామి స్టేడియం ముందు తొక్కిసలాట జరిగి అనేకమంది చనిపోవడం తెలిసిందే. దీంతో నగరం బయట విశాలమైన ఆట మైదానం అవసరమని ప్రభుత్వం నిశ్చయించింది. బెంగళూరువాసులు క్రికెట్ ప్రియులు. మ్యాచ్‌లను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, క్రీడాభిమానులు వస్తారనే విషయాన్ని పరిగణించి, నూతన స్టేడియాన్ని విశాలమైన ప్రదేశంలో నిర్మించనున్నారు. దీనిని అనుసంధానించేలా రోడ్లు, విద్యుత్ సౌకర్యాలను రూ 950 కోట్లతో ఏర్పాటు చేస్తారు. రెండవ దశలో, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తారు. ఇందులో ఇండోర్, అవుట్‌డోర్ క్రీడల మైదానాలు ఉంటాయి. కన్వెన్షన్ సెంటర్, అన్ని సౌకర్యాలు గల హోటల్ మొదలైన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. వీటన్నింటికీ సుమారు రూ1,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
ఆనేకల్ తాలూకాలో వివిధ క్రీడా సదుపాయాలతో నిర్మానం!
ఈ నెల 23న శంకుస్థాపన
ఈ స్టేడియం బెంగళూరులో మెజెస్టిక్ బస్టాండు నుంచి 48 కి.మీ., కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 72 కి.మీ, ఆనేకల్ రైల్వేస్టేషన్ నుంచి 11 కి.మీ., బొమ్మసంద్ర మెట్రో స్టేషన్ నుంచి 18.4 కి.మీ. దూరం ఉంటుంది.


