పగిలిన పైపు నుంచి వృథా అవుతున్న నీరు
నీటి కోసం మినీ ట్యాంకు పైకెక్కిన ప్రజలు
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెపుతుండగా మరో వైపు నీటి ఎద్దడి అధికమైంది. అయినా అధికారులు మౌనం వహిస్తున్నారు. జలనిర్మల పథకం కింద రూ.100 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. హరిజనవాడ, దేవినగర్‌ల మధ్యలో తాగునీటి పైపులైన్లు పగిలి పోయాయి. తాగునీటి ఎద్దడి సమస్య నివారణ విషయంలో నగరసభ యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
నీటి కోసం నానాపాట్లు
ప్రజలు మాత్రం నీటి కోసం మినీ ట్యాంకు పైకెక్కి నీటిని తోడుకుంటున్నారు. వారం రోజుల నుంచి నీరు రాక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అస్కిహాళ, దేవినగర్, హరిజన వాడ, అయ్యబోడి, మడ్డిపేటలకు వారం రోజుల కిందట నీటిని సరఫరా చేసే పైపులు పగిలి పోవడంతో మరమ్మతు పనులు చేపట్టడంలో నగరసభ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా నగరసభ అధికారులు మేల్కొని చర్యలు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
పగిలిన తాగునీటి సరఫరా పైపు
వారం రోజులుగా అందని నీరు
నీటి కోసం నగరవాసుల తహతహ


