సాక్షిబళ్లారి: ట్రాక్టర్, లారీ ఢీకొనడంతో ఐదు మందికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని మరియమ్మనహళ్లి సమీపంలో తిమ్మలాపుర వద్ద టోల్ గేట్ వద్ద మొరార్జీ దేశాయి వసతి పాఠశాల ముందు జాతీయ రహదారిపై జరిగింది. లారీ, ట్రాక్టర్ ఢీకొనడంతో లారీ డ్రైవర్ ఫయాజ్, ట్రాక్టర్ డ్రైవర్ మల్లేష్, శివప్ప తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. సండూరు తాలూకా కాళింగేరి నుంచి ట్రాక్టర్‌లో మిర్చి బస్తాలు తీసుకొని మరియమ్మనహళ్లికి వెళుతుండగా, తమిళనాడులోని కృష్ణగిరి నుంచి ముంబైకి 12 టన్నుల మామిడి కాయలను లారీలో తీసుకొని వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై రెండు వాహనాలు బోల్తా పడటంతో రోడ్డుపై మామిడి కాయలు చెల్లాచెదురుగా పడి పోయాయి. రోడ్డుపై పడిన మామిడి కాయలను తీసుకోడానికి జనం పోటీ పడ్డారు. మిర్చి సంచులు కూడా రోడ్డుపై పడిపోయాయి. రోడ్డుకు అటు వైపు మామిడి కాయలు, ఇటు వైపు మిర్చి బస్తాలు పడి పోయి వాహనాలు కూడా రోడ్డు మీదే బోల్తా పడిన నేపథ్యంలో ట్రాఫిక్ స్తంభించి పోయింది. గాయపడిన వారిని హొసపేటె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరియమ్మనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


