రాయచూరు రూరల్: సమాజంలో ప్రజలకు ధర్మ, జ్ఞాన బోధ చేయడం స్వామీజీల కర్తవ్యమని మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ సూచించారు. ఆదివారం రాయచూరు తాలూకా మిట్టి మల్కాపూర్‌లో అరూడ జ్యోతి సిద్దరూడ మఠం పీఠాధిపతి నిజానంద శివాచార్యులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో సన్మానాలు ముఖ్యం కాదన్నారు. నిరుపేదలకు అన్నదానం చేయాలని సూచించారు. సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భారతీయ సంస్కృతి ధర్మ ప్రచారంలో అందరు ముందుండాలని నిజానంద శివాచార్యులు సూచించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, మాజీ ఎంపీ బి.వి.నాయక్, మాజీ శాసన సభ్యుడు బసన గౌడ బ్యాగవాట్, తిమ్మప్ప, మహంతేష్ పాటిల్, ఈరేష్ తదితరులు పాల్గొన్నారు.
సమాజానికి ఆదర్శంగా నిలవాలి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో యువత సమాజానికి సేవలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సింధనూర్ తాలుకా క్రీడా మైదానంలో విధాన పరిషత్ సభ్యుడు బసన గౌడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5001 మంది మహిళలకు ఒడి నింపడం, 151 మందికి ఉచితంగా సాముహిక వివాహాలు చేశారు. కార్యక్రమంలో స్పీకర్ యూటి ఖాదర్, మంత్రులు ఈశ్వర్ ఖండ్రే, శివరాజ్ తంగడిగి, మధు బంగారప్ప, భోసురా, శివానంద పాటిల్, శాసన సభ్యులు హంపన గౌడ బాదర్లి, బసన గౌడ, పుట్టణయ్య, నాగరాజ్, హంపయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కలబురిగి జిల్లా
అధికారిగా మహ్మద్ షరీఫ్
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా అధికారి పౌజియాను తరూన్నమ్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మహేంతేష్ ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరు గ్రామీణ నీటి సరఫరా శాఖకు మార్చడం జరిగింది. ఆమె స్థానంలో ఆర్థికశాఖలో విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్ ఇఖ్రముల్లా షరీఫ్‌ను నూతన జిల్లా అధికారిగా నియమించారు.
తుంగభద్రలో పూడికతీత చేపట్టాలి
సాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యాంలో పూడిక చేరడంతో 33 టీఎంసీల నీటి సామర్థ్యం కోల్పోయామని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తుంగభద్ర డ్యాం గేట్లను పరిశీలించేందుకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్‌ను కలిసి సమస్యలను తెలియజేశారు. తుంగభద్ర డ్యాంలో పూడికతీతకు సంబంధించి సాధ్య, సాధ్యాలను వివరించారు. డ్యాం నిర్మాణం చేపట్టినప్పుడు డ్యాంలో 133 టీఎంసీలు నీటి నిల్వ ఉండేదని తెలిపారు. ఏటా పూడిక చేరడంతో డ్యాంలో ప్రస్తుతం 100 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంటోందని పేర్కొన్నారు. నవలి వద్ద జలాశయం అనుమతులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అనుమతులు అవసరం అన్నారు. పలు గ్రామాలు నీట ముగిగే అవకాశం ఉండటంతో ఆలోచించాలని సూచించారు. మైనింగ్ ఫండ్ ద్వారా పూడికతీత చేపట్టాలని సూచించారు.
సుదీప్ హెలికాప్టర్
ల్యాండింగ్ మార్పు
రాయచూరు రూరల్: సింధనూరులో ఆదివారం జరిగిన మహిళలకు ఒడి నింపే కార్యక్రమానికి సినీ నటుడు కిచ్చా సుదీప్ విచ్చేశారు. అందులో భాగంగా ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాల మైదానంలో హెలిపాడ్ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ హెలికాప్టర్ వస్తున్న నేపథ్యంలో దానిని వేరే చోటుకు మళ్లించాలని పోలీసులు సూచించారు. మరో వైపు సామూహిక వివాహాల సందర్భంగా బహిరంగ సభలో నూతన వధువరులను ఆశీర్వదించి వేదికపై వెళ్తున్న తరుణంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగింది. అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, వేదికపై కూర్చున్న మంత్రులు హుటాహుటిన కిందకి వచ్చేశారు. అధికారులు మంటలను అదుపు చేశారు.


