ఉడుపి, కెనడా.. ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం
దొడ్డబళ్లాపురం: ప్రస్తుతం అన్నీ ఆన్‌లైన్ మయమైపోయాయి. ఆఖరికి పెళ్లిచూపులు, నిశ్చితార్థాలు కూడా. మాగడికి చెందిన యువకుడు కెనడాలో ఉంటాడు, అతనికి ఉడుపి యువతితో ఆన్‌లైన్‌లోనే నిశ్చితార్థం జరిగింది. వరుడు సుహాస్, వధువు మేఘన. ఉడుపిలోని ఒక కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిపించారు. ఉడుపిలో మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం జరిగితే, అప్పుడు కెనడాలో అర్ధరాత్రి సమయం అయ్యింది. పెద్ద పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేసి అతిథులు వీక్షించారు. సుహాస్‌కి సెలవులు దొరక్కపోవడంతో ఇలా కానిచ్చేశారు. జనవరి 7, 8 తేదీల్లో వీరి వివాహం జరగనుంది. పెళ్లి కూడా ఆన్‌లైన్‌లో జరిపిస్తారా? అని బంధువులు హాస్యమాడారు.
పార్టీ.. యువతి కేసులో దర్యాప్తు
దొడ్డబళ్లాపురం: హోటల్ బాల్కనీ నుంచి పడి యువతి తీవ్రంగా గాయపడిన సంఘటనలో విచారణ జరుగుతోంది. వైట్‌ఫీల్డ్ డీసీపీ పరశురాం మాట్లాడుతూ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హోటల్ యజమాన్యం పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఏఈసీఎస్ లేఔట్‌లో ఓ హోటల్‌లో యువతి వైష్ణవి (21), మరికొందరు పార్టీ చేసుకుంటూ ఉండగా స్థానిక పోలీసులు దాడి చేశారు. దీంతో వైష్ణవి పారిపోతూ 4వ అంతస్తు నుంచి కిందకు పడిపోవడంతో తీవ్రగాయాలై చావు బతుకుల్లో ఉంది. హోటల్‌కు పాలికె అనుమతి తీసుకోలేదని విచారణలో తేలింది. వైష్ణవి తదితరులను పోలీసులు డబ్బులు అడిగినట్టు ఆరోపణలు వచ్చాయి, బాడీ కెమెరాలలో ఆధారాలు లభించలేదని డీసీపీ తెలిపారు. ఆధారాలు ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
కలెక్టరేటుకు బాంబు బెదిరింపు
తుమకూరు: నగరంలోని జిల్లాధికారి కార్యాలయానికి మంగళవారం ఉదయాన్నే గుర్తు తెలియని ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు ఈ–మెయిల్ వచ్చింది. దీంతో కలెక్టర్ శుభకళ్యాణ్ పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ కేవీ అశోక్, డీఎస్పీ చంద్రశేఖర్ నేతృత్వంలో పోలీసులు కలెక్టరేటు అంతటా గాలించారు. సిబ్బందిని, వారి వాహనాలను కూడా తనిఖీ చేశారు. చివరకు ఏమీ లేవని తేల్చారు. ఈ సంఘటనతో ఉద్యోగులు, పరిసరాల్లోని అంగళ్ల వ్యాపారులు భయానికి లోనయ్యారు. ఈ మెయిల్ పంపిన దుండగుల కోసం పోలీసులు విచారణ చేపట్టారు.
ఆడ శిశు భ్రూణహత్యల నివారణ: మంత్రి
శివాజీనగర: రాష్ట్రంలో ఆడ శిశు భ్రూణ హత్యల నివారణకు జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమిస్తామని ఆరోగ్య మంత్రి దినేశ్ గుండురావు విధాన పరిషత్‌లో తెలిపారు. బీజేపీ సభ్యుడు సీటీ రవి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని ఆసుపత్రుల్లో ఎక్కువగా మగపిల్లలే పుడుతున్నారని తెలిపారు. అలాంటి ఆస్పత్రులపై నిఘా వేస్తామన్నారు. ఏ తాలూకాలో మగ–ఆడ నిష్పత్తిలో ఎక్కువ తేడా ఉందో విచారణ జరిపి భ్రూణహత్యల ముఠాలను అణచివేస్తామన్నారు. అనేక రూపాల్లో జాగృతి ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భగ్గుమంటున్న చికెన్ ధర
బొమ్మనహళ్లి: డిసెంబర్ చలిలో వేడిగా నాన్ వెజ్ తినేవారికి ధరల షాక్ తగిలింది. డజన్ గుడ్ల ధర ఇప్పటికే రూ.95– 100 కు చేరుకుంది. చికెన్ ధర కూడా ఆకాశాన్నంటుతోంది. లైవ్ చికెన్ రిటైల్ ధర కేజీ రూ.170 నుంచి 180 మధ్య ఉంది. కోడి మాంసం ధర కిలో రూ.270 కి ఎగబాకింది. దీనికి కారణం.. శీతాకాలంలో గిరాకీ పెరగడం. అలాగే క్రిస్మస్, నూతన సంవత్సరం వస్తుండడంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి అధికమైంది. కోడి దాణా ధరలు పెరిగాయని పౌల్ట్రీదారులు చెబుతున్నారు. మునుముందు కేజీ చికెన్ రూ.300 దాటినా ఆశ్చర్యం లేదని అన్నారు.
ఉడుపి, కెనడా.. ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం
ఉడుపి, కెనడా.. ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం


