
వీడిన పులుల మరణాల మిస్టరీ
మైసూరు: చామరాజనగర జిల్లాలోని మలెమహదేవ వన్యజీవుల ధామంలోని మీణ్యం అటవిలో ఒక తల్లి పులితో పాటు దానికి చెందిన నాలుగు పులి పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందిన కేసును అటవీ శాఖాధికారులు చేధించారు. వాటికి విషం పెట్టడంతో మృతి చెందాయని అధికారుల విచారణలో తేలింది. ఈమేరకు హనూరు తాలూకాలోని గాజనూరుకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన పులుల కళేబరాలు లభించిన స్థలంలో ఆవు మాంసం లభించడంతో పాటు వేటాడి చంపిన ఆవు మృతదేహంపై పురుగులమందు చల్లడంతో దానిని తిన్న పులితోపాటు దాని పిల్లలు తిని మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పులి దాడిలో మృతి చెందిన ఆవు ఎవరిది? అన్న విషయం కనిపెట్టి ఆవును చంపిన కోపంతో దుండగులు పులిని చంపడం కోసం విషం పెట్టారా? లేక ఇది వేటగాళ్ల పని అయి ఉంటుందా? అన్న దానిపై తనిఖీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతి చెందిన వాటిలో నాలుగు ఆడ పులులు, ఒక మగ పులి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసును పూర్తిగా తనిఖ చేయడానికి పీసీసీఎఫ్ బీ.పీ.రవి ఆధ్వర్యంలో ఆరు మంది అధికారుల బృందాన్ని నియమించారు. పులులు మృతి చెందిన స్థలానికి అధికారులు వచ్చి పరిశీలించారు. 14 రోజుల్లో పులుల మరణానికి కారణాలపై సరైన నివేదికను ఇవ్వాలని తనిఖీ బృందం అధికారులకు సూచించారు. శుక్రవారం నాలుగు పులి పిల్లలకు పోస్టుమార్టం జరిపిన అనంతరం ఎన్‌టీసీఏ ఆదేశాల ప్రకారం 5 పులుల కళేబరాలకు అంత్యక్రియలు నిర్వహించారు.
విషం పెట్టినట్లు నివేదికలో వెల్లడి
నలుగురు నిందితుల అరెస్ట్