కలబుర్గి రొట్టి.. సిరిధాన్యపు శక్తి | - | Sakshi
Sakshi News home page

కలబుర్గి రొట్టి.. సిరిధాన్యపు శక్తి

Jul 2 2025 6:47 AM | Updated on Jul 2 2025 7:05 AM

సాక్షి,బళ్లారి: ఉత్తర కర్ణాటకలోని కలబుర్గి, బళ్లారి, కొప్పళ, రాయచూరు, బాగల్‌కోటె, బీదర్‌ తదితర జిల్లాల్లో జొన్నలు, సజ్జ రొట్టిలను ప్రధానంగా భోజనం చేస్తుంటారు. అందులోను కలబుర్గి రొట్టిలకు, జొన్నలకు మరింత గుర్తింపు ఉంటుంది. వర్షాధారిత భూముల్లో విస్తృతంగా పండించే జొన్నలను ఈ ప్రాంత వాసులు ఎక్కువగా ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారంగా గుర్తింపు పొందిన జొన్నరొట్టిలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో కలబుర్గి జొన్న రొట్టిలను ప్రస్తావించడంతో ఈ ప్రాంతంలో తయారు చేస్తున్న జొన్న, సజ్జ రొట్టిలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం మన్‌ కీ బాత్‌లో ఽప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలబుర్గి జొన్నరొట్టిలను ఽశ్లాఘించడంతో ఉత్తర కర్ణాటక పరిధిలోని కలబుర్గిలో కాకుండా కర్ణాటక జొన్న రొట్టిలకు పేరు వచ్చింది. కలబుర్గి జొన్నరొట్టిలను మోదీ ప్రస్తావించారంటే ఈ ప్రాంతంలోని ఆహారపు అలవాట్లు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

పూర్వీకుల నుంచి బలవర్థక ఆహారం

మారుతున్న కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మారిపోతున్నా మన పూర్వీకులు ముందు నుంచి ఆహారంలో ప్రతినిత్యం ఉపయోగిస్తున్న జొన్నరొట్టిలను తమ పిల్లలకు కూడా భోజనంలో ప్రతి నిత్యం తినేందుకు కృషి చేస్తుండడంతో ఆరోగ్యకరమైన జొన్న, సజ్జ రొట్టిల వాడకం ద్వారా ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిత్యం వేలాది జొన్న రొట్టిలు తయారు చేసి అమ్మకాలు సాగిస్తుండటంతో, ప్రతి ఇంటా జొన్నరొట్టిల సవ్వడి ఉంటుందని కలబుర్గి వాసులు పేర్కొంటున్నారు. ఇక్కడ పండించే జొన్నలకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది. వర్షాధారిత భూముల్లో ఎలాంటి రసాయనిక, క్రిమి సంహారక మందులు ఉపయోగించకుండా కలబుర్గి జొన్నలంటే ప్రతి ఒక్కరూ లొట్టలు వేసుకుని తినాల్సిందే. అందుకే ప్రధాని మోదీని కూడా కలబుర్గి జొన్నరొట్టిలు ఆకర్షించాయని చెప్పవచ్చు. ఇక్కడ ఎండురొట్టిలతో అప్పటికప్పుడు తయారు చేసే జొన్నరొట్టిలకు మరింత గుర్తింపు ఉంటుంది.

జొన్న రొట్టిలు తింటే వ్యాధులు దూరం

ఉత్తమ ఆరోగ్యకరమైన జొన్నరొట్టిలను తినడం ద్వారా ముఖ్యంగా చక్కెర వ్యాధి పూర్తి నియంత్రణంలో ఉంచవచ్చని, బరువు తగ్గేందుకు దోహదం చేస్తుందని కూడా వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలబుర్గి రొట్టిలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు అధికారులు కూడా కృషి చేస్తున్నారు. కలబుర్గి జొన్నరొట్టిలను బ్రాండ్‌గా తీసుకుని రావడంతో రొట్టిలను తయారు చేస్తున్న మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ తయారు చేసే జొన్న రొట్టిలను కర్ణాటక వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతులు చేస్తుండటంతో కలబుర్గి రొట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరుగాంచింది. ఈ రొట్టిలు అమెజాన్‌, జొమ్యాటోల్లో కూడా అందుబాటులోకి వచ్చాయంటే జొన్న రొట్టిలను తినేవారి సంఖ్యరోజు రోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కలబుర్గి జొన్నరొట్టిలతో పాటు ఉత్తర కర్ణాటకలో పండించే జొన్నలతో తయారు చేసే జొన్న రొట్టిలకు ఎంతో గుర్తింపు ఉందని చెప్పవచ్చు.

మన్‌ కీ బాత్‌లో జొన్నరొట్టిలకు

ప్రధాని కితాబు

ఆరోగ్యకరమైన ఆహారంగా

ఈ రొట్టిలకు గుర్తింపు

రొట్టిల తయారీతో మహిళలకు సైతం జీవనోపాధి

కలబుర్గి రొట్టి.. సిరిధాన్యపు శక్తి1
1/1

కలబుర్గి రొట్టి.. సిరిధాన్యపు శక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement