
అద్దె భూతం.. నగరజీవి సతమతం
సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీలో ఇంటి అద్దెలు భగ్గుమంటాయన్నది తెలిసిందే. ఈ వార్తలు ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి. బెంగళూరుకు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ సంపాదించేవారికి వారి జీతాల కంటే అద్దెలు ఎక్కువగా ఉన్నాయా అనిపించేలా ఇంటి బాడుగలు షాక్‌కు గురి చేస్తున్నాయి. ఆస్తుల యజమానులకు కాసుల పంట పండుతోంది.
6 నెలల్లో 15 శాతం పెరుగుదల
ఈ ఏడాదిలో తొలి ఆరు నెలలు ముగిశాయి. అదే సమయంలో ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగాయి. అంతేకాకుండా భారతదేశంలో అత్యంత ఎక్కువగా బాడుగలు ఉన్న నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలుస్తుందనడంలో సందేహం లేదని ఇక్కడి అద్దెదారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే బెంగళూరు ఇంటి అద్దెల్లో 15.7 శాతం మేర పెంపుదల నమోదైంది.
నెలకు రూ. లక్ష పైనే
ఆధునిక సౌకర్యాలతో లేఔట్లు, అపార్టుమెంట్లు, విల్లాలు ఐటీ కంపెనీలకు సమీపంగా ఉండడం పేరుతో ఇంటి అద్దెలను పెంచడం పరిపాటైంది. అద్దెదారుల నుంచి 20–25 శాతం మేర పెంచి రెంట్లను వసూలు చేస్తున్నారు. ఐటీ కారిడార్‌కు సమీపంలోని మంచి ఇంటి అద్దె ఎంత తక్కువ అనుకున్నా రూ. 1 లక్ష నుంచి 2.5 లక్షల వరకూ ఉంటోంది. ఐటీ ఉద్యోగుల జీతాలు సగం వరకు ఈ ఇంటి రెంట్లకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎవరి నియంత్రణలో ఉండడం లేదు. డిపాజిట్‌కు అయితే పరిమితి అనేది లేకుండా పోయింది. అత్యధిక వేతనాలు పొందుతున్న ఐటీ, బీటీ నిపుణులు సైతం అమ్మో అనాల్సిందే. నెలకు రూ. 2 లక్షలు సంపాదించే ఐటీ ఉద్యోగులు నెలకు కనీసం రూ. 1.2–1.5 లక్షల మేర అద్దెలు కట్టాల్సి వస్తుంది. అద్దెల భూతంపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.
కెనడవాసి విస్మయం
నగర అద్దెల గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కఠిన వాస్తవాలు జోక్‌ల రూపంలో వస్తుంటాయి. క్యాలెబ్ ఫ్రైసెన్ అనే కెనడాకు చెందిన వ్యక్తి బెంగళూరు దొమ్మలూరు డైమండ్ డిస్ట్రిక్ట్‌లో 3 బీహెచ్‌కే ఫ్లాట్‌లో బాడుగకు దిగాడు. అద్దె వివరాలను ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసినవారు కళ్లు తేలేయాల్సిందే. నెల బాడుగ ఎంతంటే రూ. 1.75 లక్షలు, సెక్యురిటీ డిపాజిట్ రూ. 19.25 లక్షలు చెల్లించినట్లు తెలిపాడు. ఆ డిపాజిట్‌తో లగ్జరీ కారునే కొనొచ్చని, మామూలు ఊళ్లలో ఇల్లే కొనుగోలు చేయవచ్చని నెటిజన్లు అనేక రకాలుగా పేర్కొన్నారు.
బెంగళూరులో భగ్గుమంటున్న బాడుగలు
భారీ వేతనజీవులకూ తప్పని కష్టం
బెంబెలెత్తిపోతున్న ఐటీ ఉద్యోగులు

అద్దె భూతం.. నగరజీవి సతమతం

అద్దె భూతం.. నగరజీవి సతమతం