
జేడీఎస్ నిరసన
యశవంతపుర: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి, పాలనా వైఫల్యం అధికమైందని ఆరోపిస్తూ బెంగళూరు నగర జేడీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఫ్రీడం పార్క్‌లో జరిగిన నిరసనలో నేతలు, కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యారంటీ పథకాల ద్వారా గద్దెనెక్కిన సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అరోపించారు. గ్యారంటీలను కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు.
పేలుళ్లకు కుక్కలు బలి
చింతామణి: గుర్తుతెలియని వ్యక్తులు అడవి పందులను వేటడానికి గాను అమర్చిన పేలుడు పదార్థాలను రెండు కుక్కలు కొరకడంతో పేలి తలలు నుజ్జయి చనిపోయాయి. ఈ సంఘటన తాలూకాలో బట్లపల్లి పోలీసు స్టేషన్ పరిదిలోని వై.గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకొంది. గ్రామ శివార్లోని నారప్ప తోట దగ్గర కుక్కల కళేబరాలను చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు. స్థల పరిశీలన జరిపిన పోలీసులు అడవి జంతువుల కోసం ఎవరో ఈ పేలుడు పదార్థాలను ఉంచారని, వాటిని కుక్కలు తినే వస్తువులని కొరకడంతో పేలిపోయినట్లు తెలిపారు. ప్రజలకు ఏమీ జరగలేదని తెలిపారు. పేలుడు పదార్థాలను పెట్టిన వారి కోసం గాలిస్తున్నారు.
గుండెపోట్లతో ధార్వాడలో ఇద్దరు..
హుబ్లీ: రాష్ట్రంలో హాసన్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో గుండెపోటు మరణాలు మిస్టరీగా మారడం తెలిసిందే. తాజాగా ధార్వాడలో కూడా ఇద్దరు గుండెపోటుతో మరణించినట్లు వెలుగులోకి వచ్చింది. నవలగుంద పట్టణ నివాసి ముత్తప్ప శంక్రప్ప పూజార (44), అదే తాలూకాలోని యమనూరు నివాసి కేబుల్ ఆపరేటర్ ఫక్కీరప్ప బణగార (45)గా గుర్తించారు. సోమవారం రాత్రి నిద్రలోనే కన్నుమూశారు. ఒకప్పుడు ఉమ్మడి ధార్వాడ జిల్లాలో భాగమైన హావేరిలో కూడా ఇద్దరు గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది.
అది మోదీ వైఫల్యం: సుర్జేవాలా
బనశంకరి: ఉగ్రవాదులను కాపాడే పాకిస్తాన్ కు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అధ్యక్ష పదవి లభించడం తీవ్ర విషయమని ఏఐసీసీ నేత, రాష్ట్ర ఇన్‌చార్జ్ రణదీప్ సుర్జేవాలా అన్నారు. బుధవారం కేపీసీసీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు అవకాశం తప్పించకుండా ప్రధాని మోదీ తప్పు చేశారన్నారు. మోదీ దేశ విదేశాల్లో పర్యటనలకు రూ.8 వేల కోట్లు ఖర్చుచేశారని, కానీ ఏ దేశం మద్దతును సంపాదించారని అన్నారు. పహల్గాం దాడి సమయంలో పాకిస్తాన్ కు వేర్వేరు దేశాలు మద్దతు ఇచ్చాయని, కానీ భారత్‌కు చుట్టుపక్కల ఉండే దేశాలు సైతం అండగా నిలవలేదని, ఇది మోదీ, కేంద్రమంత్రి జైశంకర్ వైఫల్యమని దుయ్యబట్టారు.