
ఆషాఢమాస పూజలు
కోలారు: తాలూకాలోని బిదరహళ్లి క్రాస్ వద్ద ఉన్న అశ్వర్థకట్ట వద్ద నిర్మించిన మహాగణపతి, లక్ష్మీనరసింహ, పంచముఖి ఆంజనేయస్వామి, ఆదిత్యాది నవగ్రహ దేవాలయంలో బుధవారం ఆషాఢమాసం పూజలను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లక్ష్మీదేవి అమ్మవారికి విశేష అర్చనలు చేశారు. వివిధ దేవతలకు ఫల పంచామృత అభిషేకం, అలంకారం, సహస్ర కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నోటీసులు
దొడ్డబళ్లాపురం: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కూడా సీఎంని చేయాలని రామనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ మరోసారి డిమాండ్ చేశారు. రామనగరలో బుధవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన ఇంతకుముందు ఇదే ప్రకటన చేసినందుకు పార్టీ నుంచి నోటీసులు వచ్చాయని, వివరణ ఇచ్చానని తెలిపారు. ఒకవేళ తమ నాయకుడు డీకే శివకుమార్ చర్యలు తీసుకుంటే శిరసావహిస్తానన్నారు. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని వివరణ ఇచ్చానన్నారు. అయితే తన మాదిరిగా మాట్లాడిన అందరికీ నోటీసులు ఇవ్వలేదని వాపోయారు. సీఎం సిద్దరామయ్య బాగా పరిపాలిస్తున్నారని చెప్పారు.
కారు పల్టీ, మహిళ మృతి
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి తాలూకా మాలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో మందగడ్డె 17వ మైలురాయి వద్ద బుధవారం వర్షం కారణంగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. కారు తీర్థహళ్లి నుండి శివమొగ్గ సిటీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు పల్టీలు కొడుతూ పక్కన ఉన్న నీటి గుంతలోకి పడిపోయింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మహిళ (59)ను వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయింది. మృతురాలు కుందాపూర్ తాలూకావాసిగా గుర్తించారు. డ్రైవర్‌తో సహా కారులో ఉన్న మిగతా నలుగురికి స్వల్పగాయాలయ్యాయి.
రైలు పట్టాలపై పోలీసు భార్య శవం
● 6 నెలల కిందటే పెళ్లి
యశవంతపుర: పెళ్లియిన ఆరు నెలలకే నవ వివాహితకు నూరేళ్లు నిండాయి. ఆమె అనుమానాస్పదంగా మరణించిన ఘటన హాసన జిల్లా అరసికెరె తాలూకాలో జరిగింది. వివరాలు.. దావణగెరె జిల్లా చన్నగిరికి చెందిన విద్య (23)కు అరసికెరె సోమలాపురవాసి శివుతో పెళ్లయింది. శివు పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తూ బెంగళూరు శంకరపురలో నివాసం ఉంటున్నారు. జూన్ 30న విద్యా అదృశ్యమైంది. భర్త శంకరపుర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం సాయంత్రం విద్యా శవం అరసికెరె రైల్వే ట్రాక్ వద్ద కనిపించింది. ఆమె అరసికెరెకు ఎందుకు వెళ్లిందో, ఎలా మరణించిందో అనేది మిస్టరీగా మారింది. ఒకవేళ ఆమె ఇల్లు విడిచి వెళ్తే పుట్టింటికి వెళ్లాలి కదా అనే అనుమానాలున్నాయి. పెళ్లయినప్పటి నుంచి విద్యను భర్త, అత్తమామలు వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ కూతురుని అత్తింటివారు హత్య చేశారని విద్య తల్లిదండ్రులు విలపించారు. అరసికెరె రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉప్పొంగిన భక్తిరసం
చింతామణి: ఆషాడమాస పూజల సందర్భంగా పట్టణంలో డబుల్ రోడ్డులోని రాఘవేంద్రస్వామి మఠంలో వైష్ణవి భజన మండలి మహిళలు శ్రావ్యంగా దాసర కృతులను ఆలాపన చేశారు. ఆరు గంటలపాటు ఏకధాటిగా గురురాఘవేంద్రులను కీర్తిస్తూ పాటలను ఆలపించారు. భక్తులు తన్మయులయ్యారు.

ఆషాఢమాస పూజలు

ఆషాఢమాస పూజలు

ఆషాఢమాస పూజలు