
వీటి వల్లే హాసన్‌లో గుండెపోట్లు
బనశంకరి: హాసన్ జిల్లాలో 42 రోజుల్లో 26 మంది గుండెపోటుతో మృత్యవాతపడ్డారు. ఇందులో యువతీ యువకులు, బాలలు కూడా ఉండడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో 12 మంది బెంగళూరు జయదేవ ఆసుపత్రి నిపుణులతో ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. నిపుణులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. ధూమపానం, మద్యపానం, ఊబకాయం, ఎక్కువగా మాంసం తినడం, ఫాస్ట్ ఫుడ్ అలవాటు వల్ల మరణాలు సంభవించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మేక, పొట్టేలు వంటి రెడ్ మీట్ సేవనంతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉందన్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేయాలని నిపుణులు నిర్ణయించారు. ఇప్పుడు కేవలం వారంరోజుల్లో అధ్యయనం చేసి ఈ నివేదికను సర్కారును అందజేయనున్నారు.
మహిళలు, పిల్లల మరణాలకు?
అయితే మహిళలు, బాలలకు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉండవు, మాంసాహారం కూడా పరిమితంగా ఆరగిస్తారు. వారికెందుకు గుండెపోట్లు వచ్చాయో ప్రస్తావించలేదు. నిపుణులు సాధారణ కారణాలనే చూపడం గమనార్హం. కోవిడ్ జబ్బుకు గురికావడం, అలాగే కోవిడ్ వ్యాక్సీన్లు ఆకస్మిక మరణాలకు కారణాలని జిల్లాలో వదంతులున్నాయి. టీవీలు, సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చ సాగుతోంది. కానీ వ్యాక్సిన్లతో సంబంధం లేదని ప్రభుత్వం తెలిపింది. గుండె మరణాలకు కారణాలు ఇంకా నిగూఢంగానే ఉన్నాయి.
మద్యం, మాంసం, ధూమపానం
కారణాలు కావచ్చు
నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదిక

వీటి వల్లే హాసన్‌లో గుండెపోట్లు