కార్కళలో రవిశాస్త్రి పూజలు | - | Sakshi
Sakshi News home page

కార్కళలో రవిశాస్త్రి పూజలు

Published Wed, Mar 19 2025 1:46 AM | Last Updated on Wed, Mar 19 2025 1:47 AM

యశవంతపుర: భారత మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి ఉడుపి జిల్లా కార్కళ తాలూకా బైలూరు ఎర్లపాడి కార్వలు విష్ణుమూర్తి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. నాగపూజలు చేశారు. రవిశాస్త్రి పూర్వీకులు కార్వలుకు చెందినవారుగా చెప్పుకొంటారు. 50 ఏళ్లు క్రితం వారు ముంబయికి వెళ్లిపోయారు. 2007 నుంచి ఏటా రవిశాస్త్రి ఎర్లపాడు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించి నాగదర్శనం చేసుకుంటూ ఉన్నారు. పంచామృత అభిషేకం, ఎళనీరు అభిషేకం తదితరాలు నిర్వహించారు.

పెన్నా వివాదంపై

ఢిల్లీకి వెళ్తా: డీసీఎం

శివాజీనగర: పెన్నార్‌ నదీ జలాలు, కోలారు భాగం నుంచి తమిళనాడుకు ప్రవహిస్తున్న నీటి వివాదం గురించి కేంద్ర జలశక్తి మంత్రితో చర్చించేందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు డీసీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. మంగళవారం బెంగళూరులో మాట్లాడుతూ పెన్నార్‌ నది గురించి రెండు రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడి పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. వీలైతే ఇతర శాఖల మంత్రులు, అటవీ శాఖ మంత్రిని కలుస్తానని తెలిపారు. కాగా, నగరంలో విద్యుత్‌ స్తంభం పడి ఇద్దరు మహిళలు చనిపోయిన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలను తీసుకోవాలని అన్నారు.

బస్సులో మాంగళ్యం చోరీ

మైసూరు: బస్సు ఎక్కేటప్పుడు జరిగిన తోపులాటలో ఓ మహిళ మెడలోని రూ.2.20 లక్షల విలువ చేసే 35 గ్రాముల మంగళసూత్రం చోరీకి గురైన ఘటన నగరంలో జరిగింది. వినాయకనగర నివాసి భాగ్య బాధితురాలు. నగరంలోని హూటగళ్లిలోని గార్మెంట్స్‌ ఫ్యాక్టరీలో టైలర్‌గా పని చేస్తోన్న ఆమె ఈనెల 15న పని ముగించుకుని లింగదేవరకొప్పలు సమీపంలోని బస్టాండుకు వచ్చింది. మైసూరు సిటీ బస్టాండుకు వెళ్లేందుకు కేఎస్‌ఆర్టీసీ బస్సులో ఎక్కింది. ఆ సమయంలో ఎవరో దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును చోరీ చేశారు. కొంతసేపటికి మాంగళ్యం చోరీకి గురైనట్లు తెలుసుకుంది. జయలక్ష్మిపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

మంగళూరు డ్రగ్స్‌ కేసులో ముమ్మర దర్యాప్తు

బనశంకరి: రాష్ట్రంలో అతిపెద్ద డ్రగ్స్‌ కేసును మంగళూరు సీసీబీ పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రూ.75 కోట్ల విలువచేసే 37.5 కిలోల బరువు గల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. నిందితులు బాంబ ఫెండా, అజిగైల్‌ ఆడోనిస్‌లను 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుని తీవ్ర విచారణ చేపట్టారు. ఢిల్లీలో ఓ పారిశ్రామికవాడలో డ్రగ్స్‌ను తయారుచేస్తున్నట్లు మహిళలు తెలిపాఉ. ఫార్మా ఫ్యాక్టరీ ముసుగులో మత్తు పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలియడంతో అక్కడికి పోలీసుల బృందాలు వెళ్లాయి. అలాగే బెంగళూరుకు చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు.

రాష్ట్ర సర్కారు కక్ష

సాధిస్తోంది: కుమారస్వామి

దొడ్డబళ్లాపురం: రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, న్యాయ పోరాటంలో ఈ కుట్రలను తిప్పి కొడతానని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. మంగళవారం బెంగళూరులో నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన కేతిగానహళ్లిలో తాను కష్టపడి సంపాదించుకున్న భూమిలో వ్యవసాయం చేస్తున్నానని, 40 ఏళ్ల క్రితం ఆ భూములు తాను కొన్నానని చెప్పారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తాను ఒక్క అవినీతి, అక్రమం చేయలేదన్నారు. ఆక్రమణలు తొలగించాలంటే ఎవరికై నా 15 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని అయితే తనకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదన్నారు. దేశంలో ఇలాంటి కేసుకు సిట్‌ ఏర్పాటు చేయడం మొదటిసారి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాను న్యాయ పోరాటం చేస్తానన్నారు.

కట్నపిశాచికి బలి

యశవంతపుర: కట్నం కోసం భార్యను పొట్టనబెట్టుకున్నాడో కిరాతక భర్త. దావణగెరె జిల్లా హరిహర తాలూకా హరళహళ్లి గ్రామంలో జరిగింది. నేత్రావతి (26)ని ఆమె భర్త దేవేంద్రప్ప చీరతో గొంతుకు బిగించి హత్య చేశాడు. 7 ఏళ్లు క్రితం పెళ్లి సమయంలో దేవేంద్రప్పకు 10 తులాల బంగారంతో పాటు లక్ష రూపాయిల నగదు కట్నంగా ఇచ్చారు. మరింత డబ్బు తీసుకురావాలని నేత్రావతిని భర్త వేధించేవాడు. దీంతో సోమవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగి హత్య చోటుచేసుకుంది. అల్లునిపై నేత్రావతి తల్లిదండ్రులు హరిహర రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవేంద్రప్పను అరెస్టు చేశారు.

కార్కళలో రవిశాస్త్రి పూజలు   1
1/1

కార్కళలో రవిశాస్త్రి పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement