
మాట్లాడుతున్న జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా
బళ్లారి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన, పట్టు, పశుసంవర్ధన, మత్స్యశాఖల్లో అందించిన వివిధ పథకాల ద్వారా జిల్లాలోని రైతులు సౌకర్యాలను పొందాలని జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా సూచించారు. ఆయన గురువారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలు కోసం ఈ టెక్నాలజీ అప్లికేషన్‌ను రూపొందించిందన్నారు. రైతులు తాము సాగు చేసే వివిధ పంటలు, పశుసంపద గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ సాంకేతికతను అన్ని పథకాలకు అనుసంధానం చేస్తారన్నారు. అందువల్ల రైతులు తమ పొలాల వివరాలను తప్పకుండా ఆధార్ సంఖ్య, బ్యాంక్ ఖాతాతో కలిపి నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకోసం తమకు సమీపంలోని రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన, పట్టు, పశుసంవర్థన, మత్స్యశాఖల కార్యాలయ అధికారులను సంప్రదించాలని ఆయన రైతులకు సూచించారు.