
చిత్రదుర్గ మురుఘ మఠాధిపతి శివమూర్తిస్వామి
బనశంకరి: మఠంలోని హాస్టల్లో బాలికలపై వేధింపులకు పాల్పడిన కేసులో పోక్సో చట్టం కింద అరెస్టయి జైలులో ఉన్న చిత్రదుర్గ మురుఘ మఠం శివమూర్తి శరణ స్వామికి ఎట్టకేలకు బెయిలు దక్కింది. బుధవారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తలు జస్టిస్ శ్రీనివాస్, హరీశ్‌కుమార్‌ల ధర్మాసనం ఆయనకు బెయిలు ఇచ్చింది. కొన్ని షరతులను కూడా విధించారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు చిత్రదుర్గ జిల్లాలోకి ప్రవేశించరాదు, రూ.2 లక్షల వ్యక్తిగత బాండ్ అందించాలి, అంతేమొత్తంలో ఇద్దరు హామీ ఇవ్వాలి, సాక్షులను బెదిరించరాదు, సాక్ష్యాలను నాశనం చేయరాదు, బెయిల్ మంజూరును దుర్వినియోగం చేయరాదు, కోర్టు షరతులు ఉల్లంఘనకు పాల్పడితే బెయిల్ రద్దు అవుతుందని పేర్కొన్నారు.
ఏమిటీ కేసు...
చిత్రదుర్గంలోని మురుఘ మఠం రాష్ట్రంలో శక్తిమంతమైన మఠాలలో ఒకటిగా పేరుగాంచింది. మఠాధిపతి శివమూర్తి స్వామికి పేరు ప్రతిష్టలతో పాటు అన్ని పార్టీలతో సత్సంబంధాలున్నాయి. రాష్ట్రానికి వచ్చే ఢిల్లీ ప్రముఖులు తప్పకుండా మురుఘ స్వామిని కలిసేవారు. కానీ గత ఏడాది ఆగస్టు చివర్లో అంతా తారుమారైంది. మఠంలోని పాఠశాలలో చదువుకునే బాలికలు ఇద్దరు తమపై స్వామీజీ లైంగిక దాడికి పాల్పడ్డారంటూ మైసూరులో ఆరోపించారు. ఒడనాడి సంస్థ సాయంతో వారు అక్కడే పోలీసులకు ఫిర్యాదు చేయగా మురుఘ స్వామిపై పోక్సో సహా రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కొన్నిరోజులకు ఆయనను అరెస్టు చేసి బెంగళూరు పరప్పన జైలుకు తరలించారు. పలుసార్లు బెయిలుకు అర్జీ వేసినా కోర్టులు తిరస్కరించాయి. ఏడాదికిపైగా ఆయన జైలువాసం అనుభవించారు. మరోవైపు మఠం పాలనాధికారిగా రిటైర్డు ఐఏఎస్‌ను ప్రభుత్వం నియమించింది.
పోక్సో కేసులో గతేడాది అరెస్టు

Comments
Please login to add a commentAdd a comment