కరీంనగర్ అర్బన్: కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలతో కలిసి శనివారం కలెక్టరేట్‌లో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. సమస్య ల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. మేయర్, సుడా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. అధికారులు సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నగర్ పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తోందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్‌తో పాటు అనేక కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు. పేదలు సంక్షేమ పథకాలను వినియోగించు కోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.
శాఖలవారీగా సమస్యల పరిష్కారం
గంగాధర: ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యమిస్తూ, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని ఫంక్షన్ హాలులో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి, సాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. ఇప్పటికే రూ.23.50 కోట్లు మంజూరయ్యాయని, మరో రూ.20 కోట్లు మంజూరవుతాయన్నారు. మద్ధతు ధరతో ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రతి గ్రామంలో కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ సీ్త్ర, శిశు సంక్షేమం, స్థానిక సంస్థలు, ఇందిరమ్మ ఇల్లు, ప్రజావాణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నియోజకవర్గస్థాయి క్లస్టర్ ఆఫీసర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేశ్వర్, ఎంపీడీవో రాము, తహసీల్దార్ రజిత పాల్గొన్నారు.


