యాప్‌తోనే జనగణన
2011 లెక్కల ప్రకారం
కరీంనగర్ అర్బన్: సాగుతూ.. ఆగిన జనగణన ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కనుంది. గత నాలుగేళ్లుగా జనగణనపై ప్రభుత్వ ప్రకటన.. అంతలోనే వాయిదా వంటివి జరగగా ఈ సారి పక్కాగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఇప్పటికే బ్లాకులుగా విభజించిన అధికారులు మరో 20రోజుల్లో ఎన్యుమరేటర్లకు శిక్షణనిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పక్కా లెక్కలతో పాటు ఇళ్లు, కట్టడాల వివరాలతో పాటు సౌకర్యాల వివరాలను నమోదు చేయనున్నారు. ఇక సదరు ప్రక్రియ అంతా స్మార్ట్‌ఫోన్‌లోనే జరగనుండగా ఇంటర్నెట్ లేకున్నా యాప్ పని చేయనుంది.
ఒక్కో ఇల్లు రెండుసార్లు పరిశీలన
స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసిన జనగణన యాప్‌లోనే వివరాలను నమోదు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఎదురవుతుండటంతోనే ఆఫ్‌లైన్ వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో జనగణన కార్యక్రమం చేపట్టనుండగా ఎన్యుమరేటర్లకు జనవరి, ఆ తదుపరి రెండు దశల్లో శిక్షణనిస్తారు. ఎన్యుమరేటర్ తనకు కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లకు రెండు దశల్లో వెళ్లి వివరాలు నమోదు చేయాలి. వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబరులోగా మొదటి దశ కింద ప్రతి ఇల్లు, కట్టడం వివరాలన్నీ సేకరించనుండగా రెండో దశలో వ్యక్తిగత వివరాల సేకరణ కార్యక్రమం 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు.
నాలుగేళ్లుగా సా..గదీత
2019లోనే జనగణన జరగాల్సి ఉండగా కోవిడ్–19 క్రమంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. 2018లో అందుకు సంబంధించిన ప్రక్రియ జరగగా కరోనా నీళ్లు చల్లింది. కోవిడ్–19 నేపథ్యంలో వాయి దా పడుతూ రాగా అన్ని సక్రమంగా ఉంటే జనవరిలో జనగణన ప్రక్రియ షురూ కానుంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు, నూతన మండలాలు, కొ త్త మున్సిపాలిటీలు వాటి పరిధిలో నివాసాలెన్ని, ఎ ంత మంది సిబ్బంది అవసరమనేది తేల్చారు. భౌ గోళిక స్వరూపం క్రమంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఇచ్చిన ఇంటి నంబర్ల ఆధారంగా బ్లాకులుగా విభజించారు. ప్రతీ గ్రామం, మండలం, జిల్లా జనగణన పటాలను సిద్ధం చేశారు.
ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులు..
ఛార్జ్ ఆఫీసర్లు తహసీల్దార్లు
ఎన్యుమరేట్ బ్లాక్‌లకు సంబంధించి ప్రత్యేక ఫార్మాట్‌లో వివరాలను రూపొందించారు. జిల్లాలో 316 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలుండగా 2.62లక్షల నివాసాలున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో నిర్మాణమైన కొత్త భవనాలను పరిగణలోకి తీసుకున్నారు. కాగా ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులను తీసుకోనున్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించనుండగా పర్యవేక్షకులుగా స్కూల్ అసిస్టెంట్లు, హెచ్‌ఎం, యంఆర్‌సీలను నియమించనున్నారు. మొత్తం బ్లాక్‌ల సంఖ్య క్రమంలో 402మంది పర్యవేక్షకులు అవసరం. మండలస్థాయిలో ఛార్జ్ ఆఫీసర్‌గా తహసీల్దార్, అదనపు ఛార్జ్ అఫీసర్‌గా ఎంపీడీవో వ్యవహరించనుండగా మండల ప్రణాళిక, గణాంక అధికారులు డీలింగ్ అసిస్టెంట్లుగా వ్యవహరించనున్నారు.
మరో 20రోజుల్లో ఎన్యుమరేటర్లకు శిక్షణ
ఏప్రిల్ నుంచి జనగణన ప్రక్రియ షురూ
ఎన్యుమరేటర్ రెండుసార్లు ఇంటి వివరాలు సేకరించాల్సిందే
ఇంటర్నెట్ లేకున్నా యాప్‌లో నమోదు
జిల్లా జనాభా: 10,05,711
నివాసాలు: 2,58,485
కుటుంబాలు: 2,90,657
2011 జన గణనలో బ్లాక్‌లు.. కొత్తగా 2021 జనగణన బ్లాకుల ఏర్పాటు వివరాలు
మండలం 2011 2022
గంగాధర 89 101
రామడుగు 104 114
చొప్పదండి 61 71
కరీంనగర్ రూరల్–1 55 65
కరీంనగర్ రూరల్–2 53 63
గన్నేరువరం 55 56
మానకొండూరు 128 133
తిమ్మాపూర్ 83 94
చిగురుమామిడి 83 91
సైదాపూర్ 79 93
శంకరపట్నం 81 101
వీణవంక 91 96
హుజూరాబాద్ 124 79
జమ్మికుంట 139 83
ఇల్లందకుంట 69 69
మున్సిపాలిటీ 2011 2021
కరీంనగర్ 388 808
చొప్పదండి 26 50
హుజూరాబాద్ 46 109
జమ్మికుంట 73 116


