పరిశీలించి.. ఆరా తీసి | - | Sakshi
Sakshi News home page

పరిశీలించి.. ఆరా తీసి

Dec 5 2025 6:06 AM | Updated on Dec 5 2025 6:06 AM

పరిశీలించి.. ఆరా తీసి

పరిశీలించి.. ఆరా తీసి

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

పెద్దపల్లి జిల్లా అంతర్గాం గోలివాడ శివారులోకి వచ్చే ప్రభుత్వ భూముల వద్దకు ఏఏఐ బృందం అధికారులు చేరుకునే సరికి ఇరిగేషన్‌, రెవెన్యూ, గ్రౌండ్‌వాటర్‌, హైడ్రాలజిస్ట్‌, సింగరేణి, ఎన్టీపీసీ, ఎన్‌పీడీసీఎల్‌, ట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ, మైనింగ్‌ తదితరశాఖలకు చెందిన జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య భూమికి సంబంధించి నక్ష (చిత్రపటం) ఆధారంగా వివిధ సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమి లభ్యత, సత్వరమే అందుబాటులోకి తీసుకునే అవకాశాలు, భూ విస్తీర్ణం, సదరు భూములలో సాగయ్యే పంటలు, భూముల యధార్థ స్థితిగతులతో పాటు ప్రభుత్వేతర భూలభ్యత, విస్తీర్ణం తదితర అంశాలను వివరించారు.

ప్రభుత్వ భూముల్లో హైటెన్షన్‌ టవర్లు

ప్రతిపాదిత స్థలంలో 400 కేవీ హైటెన్షన్‌ టవర్లు, విద్యుత్‌ తీగలను పరిశీలించిన ఏఏఐ అఽధికారులు తొలగించాల్సి ఉంటుందని, లేదంటే భూగర్భం నుంచి విద్యుత్‌లైన్‌ వేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రతిపాదిత స్థలం నుంచి నాలుగు కిలోమీటర్ల రేడియస్‌లో 45 మీటర్లలోపు, ఆరు కిలోమీటర్ల రేడియస్‌ తర్వాత 90 మీటర్ల ఎత్తులో నిర్మాణాలున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేయగా, ప్రతిపాదిత స్థలంలో సుమారు 60కి పైగా టవర్లు ఉండే అవకాశం ఉంటుందని ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాస్‌ తెలిపారు. తొలుత టవర్లను ఎత్తివేసేందుకు అంచనా వ్యయం సుమారు రెండువేల కోట్లుగా భావించినా, ప్రస్తుతం ఏఏఐ వారిచ్చిన నివేదికలలో పేర్కొన్న మేరకు మరోసారి అంచనా వ్యయ నివేదిక సిద్ధం చేయాల్సి ఉండనుంది.

స్థల లభ్యతపై

ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరం ఉన్నట్లు ఏఏఐ అధికారులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం 600 ఎకరాల ప్రభుత్వ భూ లభ్యత ఉండగా, మరో 400 ఎకరాలు ప్రభుత్వేతర భూములు అందుబాటులో ఉన్న నివేదికను అందజేసినట్లు సమాచారం. ల్యాండింగ్‌ అయ్యే స్థలం నుంచి 1.5 కిలో మీటర్‌ రేడియస్‌లో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదని, సదరు స్థలాన్ని నిషేధిత స్థలంగా పరిగణించడం జరుగుతుందని ఏఏఐ ప్రతినిధులు తెలిపారు.

గోదావరినది తీరం సందర్శన

ఏఏఐ బృందం గోలివాడ గోదావరినది తీరాన్ని సందర్శించడంతో పాటు నీటి లభ్యత అంశాలను నీటిపారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో నీటి లభ్యత 130 మీటర్లు, వరదల సమయంలో గరిష్టంగా 280 మీటర్ల ఎత్తులోకి వరద చేరుతుందని, భూగర్భ జలాలు పది మీటర్లస్థాయిలో ఉంటాయని వివరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. ఏటా గరిష్టంగా ఇన్‌ఫ్లో, కనిష్ట ఇన్‌ఫ్లో, నీటి లభ్యత, సాగు, తాగునీటి కేటాయింపుల వివరాలు, ప్రాజెక్టు గేట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ వివరాలు, పునరావాసం తదితర అంశాలను తెలుసుకున్నారు. అండర్‌గ్రౌండ్‌ వంతెన పరిశీలన, రోడ్డు భూగర్భంలో ఏమైనా రైల్వే కమ్యూనికేషన్‌కు కేబుల్స్‌, రైల్వే ట్రాక్షన్‌ మీద విద్యుత్‌ తీగల ఎత్తు, ప్రతిపాదిత విమానాశ్రయం స్థల దూరం, సమీపంలో ఉన్న విద్యుత్‌ టవర్స్‌ ఎత్తు, ప్రతీ రోజు రైళ్ల రాకపోకల సంఖ్య తదితర అంశాలను నేరుగా పెద్దంపేట రైల్వేస్టేషన్‌కు వచ్చి తెలుసుకున్నారు. మొత్తంగా ఏఏఐ అధికారుల బృందం పర్యటనతో ఇప్పటికై నా విమానం ఎగిరేనా.. ఎప్పటిలాగే పర్యటనలు, నివేదికలకే పరిమితమవుతుందా అనే చర్చ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజల్లో నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement