ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పొలంలో దున్నుతుండగా కేజ్‌వీల్ ఊడిపోయి ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో విషాదం నింపింది. ఎస్సై రాహుల్‌రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాలు. వెంకటాపూర్‌కు చెందిన గడ్డం జితేందర్(30) గురువారం పోతిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో పొలం దున్నుతుండగా కేజ్‌వీల్ ఊడిపోయింది. ఏం జరిగిందోనని తెలుసుకునేందుకు వెనక్కి తిరిగి చూడగా ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి బాల్‌రాజ్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన జితేందర్ మరణంతో వారి కుటుంబం రోడ్డున పడింది. మృతునికి భార్య దివ్య, కుమారుడు విశాల్, తల్లి లక్ష్మి ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ యువకుడు మృతి
వెల్గటూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఎండపల్లి మండలం కొత్తపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేటకు చెందిన గౌరెల్లి లక్ష్మణరావు (37) గత నెల 29న రోజువారీ పనులు ముగించుకుని వెల్గటూర్ నుంచి బైక్‌పై కొత్తపేట వస్తుండగా రోడ్డుపై గుంతలను తప్పించే క్రమంలో బైక్‌పై వస్తున్న ముత్తునూర్‌కు చెందిన కల్యాణ్‌ను ఢీ కొట్టాడు. ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కల్యాణ్‌ను జగిత్యాల, లక్ష్మణరావును కరీంనగర్ తరలించారు. చికిత్సపొందుతూ లక్ష్మణరావు గురువారం మృతి చెందాడు. లక్ష్మణరావుకు 8ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య సహజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.
భార్య వెంటే భర్త
మానకొండూర్ (శంకరపట్నం): భార్య మృతి చెందిన 24 గంటలకే భర్త మృతి చెందిన ఘటన శంకరపట్నం మండలం ముత్తారంలో జరిగింది. గ్రామానికి చెందిన కనకం రాజమల్లు, రాజవ్వ అనే వృద్ధ దంపతులు ఎంతో అన్యోనంగా ఉండేవారు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. కొంతకాలంగా వీరు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాజవ్వ బుధవారం మృతి చెందగా, భర్త రాజమల్లు గురువారం మృతి చెందాడు.
భూ విస్తీర్ణం అధిక నమోదుపై కేసు
మల్యాల: భూవిస్తీర్ణం తప్పుడుగా అధికంగా పహాణిలో నమో దు చేసిన జీపీఓతోపాటు, భూ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు. మండలంలోని తాటిపల్లికి చెందిన జలజ కొన్నేళ్లక్రితం పహాణిల సర్టిఫైడ్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. బల్వంతాపూర్ జీపీఓ ప్రవీణ్‌ను కలిసి భూ విస్తీర్ణం అధికంగా నమోదు చేయాలని సంప్రదించింది. దీనికి ప్రవీణ్ తాటిపల్లికి చెందిన కొన్ని సర్వే నంబర్లలో ఉన్న భూమిని పహాణి 2.20 ఎకరాలను జలజ పేరిట రాయించాడు. ఫైళ్లను పరిశీలించిన తహసీల్దార్ వసంత ప్రభుత్వ రికార్డులు, పహాణీలను ట్యాంపరింగ్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రవీణ్, జలజపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం


