
యువరానర్ నుంచి ఆర్డర్.. ఆర్డర్ వరకు
● జడ్జీలుగా వేములవాడ యువతులు ● టాలెంట్‌కు అడ్డురాని పేదరికం ● కష్టపడి చదివి.. ఇష్టంగా గెలిచి ● ఆదర్శంగా యువ జడ్జీల విజయగాథ
వేములవాడ: జడ్జీ.. కా వాలనే లక్ష్యానికి కష్టాలు తలొగ్గాయి. లక్ష్యం బలమైనది అయితే వి జయం దరిచేరుతుందనేందుకు వేములవాడకు చెందిన యువతులే నిదర్శనం. పదో తరగతి వరకు పుట్టిన ఊరిలోనే చదివిన వారు.. ‘యువరానర్ అనే స్థాయి నుంచి ఆర్డర్.. ఆర్డర్’.. అనే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో అడుగులు వేశారు. ఒక్కో అడుగును లక్ష్యం వైపు తీసుకెళ్లారు. మొదట లా పట్టా సాధించి.. వేములవాడ బార్ అసోసియేషన్‌లో సభ్యులుగా చేరారు. కోర్టులో న్యాయ వ్యవహారాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ అనుభవం.. చదువుకున్న జ్ఞానం.. కష్టపడేతత్వంతో జడ్జీలుగా ఎంపికయ్యేందుకు మార్గమయ్యాయి. వేములవాడకు చెందిన ప్రియాంక, వందన, ప్రవళిక, జాహ్నవిలు జడ్జీలుగా ఎంపికయ్యారు. వారి సక్సెస్ స్టోరీ ఈ సండే స్పెషల్.
కృషితోనే విజయం
వేములవాడకు చెందిన ఈ నలుగురు యువతులు ముందుగా స్థానిక బార్ అసోసియేషన్ సభ్యులుగా చేరి జూనియర్ లాయర్లుగా తమ ప్రయాణం ప్రారంభించారు. కోర్టులో కేసుల ట్రయల్స్ చూడడంతోపాటు వాటి నుంచి రోజుకో కొత్త విషయం నేర్చుకున్నారు. ఆ అనుభవాలను తమ విజయానికి బాటలుగా వేసుకున్నారు. కోచింగ్ తీసుకోకుండానే సొంతంగా ప్రిపేర్ అయ్యారు. చిన్నపట్టణాల నుంచి వచ్చిన వారు పెద్ద స్థాయి ఉద్యోగాలు సాధించలేరనే అపోహలను వీరు తొలగించారు. కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు.