
ఎస్సై వేధించాడని ఆత్మహత్యాయత్నం
ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్‌స్టేషన్ ఎస్సై లక్ష్మణ్ వేధించాడని ఆరోపిస్తూ మండలంలోని మేడారం గ్రామానికి చెందిన కొండా రాములు (54) ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రాములు చిన్న కుమారుడు సాగర్‌ను ఇదే గ్రామానికి చెందిన 8 మంది 2021 జూలై 7న హత్య చేశారు. ఈ కేసులో ఇదే గ్రామానికి చెందిన పోలవేణి రామయ్యతో పాటు అతడి కుటుంబసభ్యులు ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు ప్రసుత్తం కోర్టులో ట్రయల్‌కు వచ్చింది. ఈక్రమంలో రాములు రాజీపడితే పోలవేని రామయ్య రూ.22 లక్షలు ఇచ్చేందుకు గ్రామ పెద్దమనుషుల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కేసులో కోర్టు తీర్పు ప్రకారం శిక్షపడితే నిందితులకు ఆ డబ్బులు రాములు వాపస్ ఇవ్వాలని పెద్దల సమక్షంలో దాదాపు ఎడు నెలల క్రితం ఒప్పందం జరిగింది. కాగా, అదే రోజు ధర్మారం గ్రామీణ బ్యాంకులో మృతుడి తండ్రి రాములు సోదరుడు మల్లేశంతో పాటు హత్య కేసులో నిందుతుల తరఫున మరో వ్యక్తి పేరిట జాయింట్ అకౌంట్లో రూ.22లక్షలు జమచేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో నిందితులకు సానుకూలంగా సాక్ష్యం చెప్పాలని ఒప్పందం ఉండగా, సాక్ష్యులతో పాటు తండ్రి సైతం నిందితులకు సానుకూలంగా చెప్పినట్లు సమాచారం. కానీ, మృతుడి తల్లి మాత్రం తన కుమారుడిని గ్రామానికి చెందిన రామయ్య, అతడి కుటుంబసభ్యులే హత్య చేశారని కోర్టులో వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. మృతుడి తల్లి తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు బ్యాంకులో జమ చేసిన డబ్బులు ఇవ్వాలని నిందితులకు సంబంధించిన పెద్దమనుషులు రాములు సోదరుడు మల్లేశంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పినా పెద్దమనుషులు ఒత్తిడి తీసుకువస్తున్నారని శనివారం రాములు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైని కలిసి వివరించాడు. ఈ విషయంలో డబ్బులు ఇవ్వాల్సిందేనని ఎస్సై వేధించడంతో మనస్తాపానికి గురైన రాములు ఆదివారం మధ్యాహ్నం 100 నంబర్‌కు ఫోన్ చేసి తాను ఎస్సై వేధింపులకు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పాడు. పొలం వద్ద పురుగుల మందుతాగాడు. కుటుంబసభ్యులు అక్కడకు వెళ్లి అపస్మారక స్థితిలో పడిఉన్న రాములును కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
రాములును వేధించలేదు: ఎస్సై లక్ష్మణ్
హత్యకేసులో రాజీ కుదుర్చుకున్న విషయంలో బ్యాంకులో జమ చేసిన డబ్బులు ఇవ్వాలని పెద్దమనుషులు ఒత్తిడి తెస్తున్నారని, వారిని స్టేషన్‌కు పిలిపించాలని రాములు శనివారం స్టేషన్ వచ్చినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. అయితే హత్య కేసులో రాజీ కుదుర్చుకోవడం నేరమని, తాను ఎవరినీ పిలిపించనని రాములకు చెప్పి పంపించినట్లు పేర్కొన్నారు. అతడిని వేధించినట్లు ఆరోపించడం సరికాదన్నారు.
కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు

ఎస్సై వేధించాడని ఆత్మహత్యాయత్నం