
తాళం వేసిన ఇంట్లో చోరీ
● కిలో వెండి.. రూ.30 వేల నగదు అపహరణ
రత్నాపూర్‌లో..
మల్లాపూర్: మల్లాపూర్ మండలం రత్నాపూర్‌కు చెందిన పిప్పెర రమేశ్ ఇంట్లో చొరబడిన దొంగలు రెండు తులాల బంగారం, రూ.13,000 ఎత్తుకెళ్లినట్లు ఎస్సై రాజు తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉద్యోగి రీత్యా బెంగళూర్ వెళ్లగా దొంగలు చొరబడ్డారు.
మంథని: వరుస దొంగతనాలు పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి వేళ పోలీసుల గస్తీ ఉన్నా దొంగతనాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగు రోజుల క్రితం ధర్మారం గ్రామంలో కందుకూరి లక్ష్మికి చెందిన రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఆ ఘటన మరువక ముందే మంథనిలో మంగళవారం మరోచోరీ వెలుగుచూసింది. దొంతులవాడకు చెందిన ఐరన్ హార్డ్‌వేర్ వ్యాపారి ఇల్లందుల వెంకటేశ్వర్లు తన కుమారుడిని కళాశాలలో చేర్పించేందుకు ఆదివారం హైదరాబాద్ వెళ్లారు. ఇంటికి తాళం వేసిన అతడి భార్య స్థానికంగానే బంధువుల ఇంటికి వెళ్లింది. సోమవారం రాత్రి ఊరునుంచి తిరిగివచ్చిన వెంకటేశ్వర్లు.. ఇంట్లోకి వెళ్లి చూడగా గదుల తలుపులు తెరిచి ఉన్నాయి. ప్రధాన గదికి వేసిన తాళం పగులగొట్టి ఉంది. బీరువాలు తెరిచి ఉన్నాయి. దొంగతనం జరిగినట్లుగా నిర్ధారించుకున్నాక బీరువాలో పరిశీలించగా రూ.30 వేల నగదు, పూజాగదిలోని సుమారు కిలో వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. అలాగే టీవీ, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. తులసీగద్దె సమీపంలోని ఇనుప గడ్డపారను తీసుకెళ్లి తాళాలు పగుల గొట్టినట్లు తెలుస్తోంది. బురదతో నడిచిన కాలిముద్రలు కనిపించాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. క్ల్యూస్ టీం ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేశారంటే దొంగలముఠా సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.