
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
రామగుండం: సికింద్రాబాద్, కాజీపేట–సిర్‌పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు ఎప్పుడూ ఆలస్యంగానే రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు రవాణాతో పోల్చితే రైలు ప్రయాణం సమయం ఆదా, సురక్షిత, సుఖమయమైన ప్రయాణం, బస్సు చార్జీల్లో నాలుగో వంతు రైలు చార్జీలు కావడంతో సాధారణ, మధ్యతరగతి ప్రయాణికులు రైలు ప్రయాణాల వైపే మొగ్గు చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ సాధారణ ప్రయాణికుల కష్టాలను గుర్తించే పరిస్థితిలో ప్యాసింజర్ రైళ్ల సమయపాలనపై దృష్టి సారించకపోగా.. బోగీల నిర్వహణను సైతం పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగజ్‌నగర్ నుంచి కాజీపేట, కొత్తగూడెంకు నిత్యం వేలాది మంది కోల్‌బెల్ట్ నుంచి ప్యాసింజర్ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వే శాఖ సాధారణ ప్రయాణికుల సంక్షేమాన్ని వీడి లాభాపేక్షపైనే దృష్టి సారిస్తున్నట్లు అత్యధిక శాతం ప్రయాణికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కానరాని సమయపాలన
కాగజ్‌నగర్ నుంచి కాజీపేటకు ఇరువైపులా నడిచే ప్యాసింజర్ రైళ్లు నిర్దేశిత సమయానికి వచ్చాయంటే ఆరోజు ప్రత్యేకం. సికింద్రాబాద్–బల్హర్షా(భాగ్యనగర్), కాజీపేట–కాగజ్‌నగర్(రామగిరి), కొత్తగూడెం–కాగజ్‌నగర్(సింగరేణి), కాగజ్‌నగర్–కరీంనగర్(డెమూ) రైళ్లు ప్రతీరోజు కనీసం గంట.. గరిష్టంగా రెండు గంటలకు పైగానే ఆలస్యంగా నడుస్తుంటాయి. ప్యాసింజర్ రైళ్లతో ఆదాయం తక్కువ కావడంతోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.
బోగీల నిర్వహణ అస్తవ్యస్తం
ప్యాసింజర్ రైళ్ల బోగీలను ఎప్పటికప్పుడు వాషింగ్ చేయకపోవడం, వాష్‌రూంలకు నీటి సరఫరా లేకపోవడం, బియ్యం అక్రమ దందాలకు క్యాబిన్‌గా మారడం, డోర్లు విరిగిపోయి ఉండడం తదితర సమస్యలతో సాధారణ ప్రయాణికులు అత్యవసరాలకు వెళ్లలేని దుస్థితి. ఒకవేళ అక్కడకక్కడ వాష్‌రూంలున్నా.. నీటి సరఫరా లేక మలంతో నిండిపోయి తీవ్ర దుర్వాసనతో ఉంటున్నాయి. ప్రతీరోజు ఇరువైపులా రాకపోకల షెడ్యూల్ పూర్తయ్యాక శుభ్రం చేయాల్సి ఉన్నా.. రైల్వే అధికారుల చర్యలు శూన్యం.
తరచూ రద్దు..
కాజీపేట–బల్లార్షా సెక్షన్ల మధ్య ఎక్కడ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగినా.. తొలుత ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం పరిపాటిగా మారింది. ఈ విధానం కోవిడ్ తర్వాత సాధారణమైంది. అదే రైల్వే ట్రాక్ మీదుగా గూడ్సు రైళ్ల రాకపోకలకు లేని అభ్యంతరం ప్యాసింజర్ రైళ్లకు ఎందుకంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఎక్స్‌ప్రెస్ రైళ్ల రూట్ మళ్లిస్తున్నారు. అప్పటికే ప్రయాణికులు తమ ప్రయాణ షెడ్యూల్‌ను ఫిక్స్ చేసుకొని సిద్ధమయ్యేలోగా దారి మళ్లిస్తున్నట్లు సమాచారం అందజేయడం సాధారణంగా మారింది.
ఆన్‌లైన్ అనౌన్స్‌మెంట్..
రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల నేపథ్యంలో రైళ్ల రాకపోకలపై ప్లాట్‌ఫారంపై ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేసే ఆన్‌లైన్ అనౌన్స్‌మెంట్ రద్దు చేశారు. ప్లాట్‌ఫారంపై బోగీ నిలిపే స్థలాన్ని సైతం గుర్తించే సైన్‌బోర్డులు పని చేయడం లేదు. బోగీల వివరాలు మైక్‌లో ప్రకటిస్తున్నా.. ప్రయాణికులకు అర్ధం కావడం లేదు. ఫలితంగా రైలు వచ్చి నిలిచిన తర్వాత లగేజీతో పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
సాంకేతిక కారణాలతో తరచూ రద్దు
బోగీల నిర్వహణను గాలికొదిలేసిన రైల్వే శాఖ
ప్రయాణికులకు తప్పని తిప్పలు
రైల్వే జీఎంకు ఫిర్యాదు చేశా
రైళ్ల ఆలస్యంపై పలుమార్లు రైల్వే జనరల్ మేనేజర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా. రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులతో తరచూ సాంకేతిక కారణాలను చూపుతూ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం సరికాదని ఉన్నతాధికారులకు వివరించా. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు పూర్తయ్యాక నూతనంగా ఎంపికయ్యే పెద్దపల్లి ఎంపీని కలిసి సమస్యలను వివరించి ఎంపీ సహకారంతో మరోసారి రైల్వే జీఎంను కలుస్తా.
– అనుమాస శ్రీనివాస్,
రైల్వే ప్రజాసంబంధాల మాజీ ప్రతినిధి

ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?

ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?